- సుప్రీంకోర్టు
యూఢిల్లీ, సాక్షి, చెన్నై: జల్లికట్టుపై దాఖలైన అన్ని పిటిషన్లను జనవరి 31న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ కొనసాగింది. జల్లికట్టుపై మధ్యంతర దరఖాస్తులకు అనుమతించిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం అన్నింటిని జనవరి 31న విచారిస్తానని తెలిపింది. మరోవైపు జల్లికట్టును అనుమతిస్తూ జనవరి 6 ఇచ్చిన నోటిషికేషన్ ను ఉపసంహరించుకుంటామని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఇప్పటికే కోర్టుకు ఆ విషయాన్ని వెల్లడించామని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గుర్తు చేశారు. ఆ అంశంపై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనమే విచారణ కొనసాగిస్తుందని జస్టిస్ మిశ్రా చెప్పారు.
హింసకు విద్రోహ శక్తులే కారణం: పన్నీరు సెల్వం
జాతి, సంఘ విద్రోహ శక్తులతో పాటు అతివాద శక్తులే జల్లికట్టు ఆందోళనల్లో హింసకు కారణమని తమిళనాడు ఆరోపించింది. ప్రదర్శనను పక్కదారి పట్టించిన దుష్ట శక్తుల్ని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నకు బదులిస్తూ చెన్నై నగరంలోని పలు ప్రాంతాల నుంచి విద్రోహ శక్తులు ఉద్యమకారులతో కలిసిపోయి ఆందోళన విరమణకు అంగీకరించలేదన్నారు.
వారిలో కొందరు ప్రత్యేక తమిళనాడు డిమాండ్‌ను లేవనెత్తారని, మరికొందరు ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు చూపుతూ రిపబ్లిక్ డేను బహిష్కరించాలంటూ నినాదాలు చేసినట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. సీఎం సమాధానం సంతృప్తికరంగా లేదంటూ స్టాలిన్ సహా డీఎంకే సభ్యులంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.