రూ.100 కోట్లకు ఈ-‘టెండర్’! | Heavily manipulated in E-Tenders | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లకు ఈ-‘టెండర్’!

Published Tue, Sep 16 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

Heavily manipulated in E-Tenders

సాక్షి, ముంబై: నగరంలో అభివృద్ధి పనులకు గాను చేపట్టిన ఈ-టెండరింగ్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయి. మహా నగర పాలక సంస్థ (బీఎంసీ) పరిధిలోని వార్డుస్థాయిలో చేపట్టిన సుమారు రూ.600 కోట్ల విలువైన పనుల్లో రూ.100 కోట్ల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన నివేదిక బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేకు సమర్పించారు.

ఈ అవినీతిలో హస్తమున్న 20 మంది ఇంజినీర్లతోపాటు మరికొంత మంది బీఎంసీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయి. అలాగే కొందరు కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిప్యూటీ కమిషనర్ వసంత్ ప్రభును  సీతారాం కుంటే ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఎంతమందిపై చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటారు.

 బీఎంసీలో 227 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతియేటా ఆయా వార్డుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు, గుంతలు పూడ్చడం, మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయడం, నీటి పైపులకు మరమ్మతులు తదితర పనులు జరుగుతుంటాయి. దీంతో ఆయా వార్డుల స్థాయిలో అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేందుకు ఈ-టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గతంలో బీఎంసీ అధికారులు ఈ పనులన్నీ తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే అప్పగించేవారు.

దీని వల్ల అవినీతి, అవకతవకలు జరుగుతున్నాయని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో పనులు పారదర్శకంగా జరగాలంటే ఆ ప్రక్రియకు పూర్తిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుంటే భావించారు. అందుకు ఈ-టెండర్ ప్రక్రియ అమలుచేయాలని నిర్ణయించారు. కాగా, ‘ఈ-టెండరింగ్’ను అప్పట్లో చాలామంది కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అయినప్పటికీ కుంటే బలవంతంగా దీన్ని అమలు చేశారు. ఇటీవల రూ.600 కోట్లతో పూర్తిచేసిన అభివృద్ధి పనులన్నీ ఈ-టెండర్ ద్వారా చేపట్టినవే.

కాని ఇందులో కూడా గతంలో లాగే తమకు నచ్చిన కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగించినట్లు తేలిసింది. దీనిపై విజిలెన్స్ అధికారులు పరిశీలించగా రూ.100 కోట్ల మేర అవకవతకలు జరిగినట్లు ఆరోపించారు. దీంతో బీఎంసీ పరిపాలన విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న అవినీతి బాగోతం మరోసారి బయటపడినట్లయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement