బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా
బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా
Published Fri, Mar 3 2017 9:07 PM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీలు నిర్వహిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్నుల (ఐటీ) శాఖ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక‌్షన్స్ చట్టం- 1988 ప్రకారం ఎవరూ బినామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని, ఈ చట్టం 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. దీని ప్రకారం బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సాయం చేసిన వారు అందరూ శిక్షార్హులే. అటువంటి వారికి 7 ఏళ్ల వరకు జైలు, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది.
ఒకవేళ అధికారులకు బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం గతేడాది అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు రిజిస్ట్రర్ కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. అలాగే రూ. 200 కోట్ల ఆస్తులకు సంబంధించి ఐటీ శాఖ 140 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 124 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 55 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటాచ్ అయిన ఆస్తుల్లో బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూములు, ప్లాట్లు, జ్యువెలరీ మొదలైనవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Advertisement