అస్సాం, బెంగాల్లో భారీ పోలింగ్
గువాహటి/కోల్‌కతా: అస్సాం, పశ్చిమబెంగాల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. అస్సాంలో 85, పశ్చిమ బెంగాల్లో 79.56 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొదటి దశకు భిన్నంగా ఈ సారి అస్సాంలో హింస చోటుచేసుకుంది. బార్పేట జిల్లా సొర్‌భోగ్ పోలింగ్ కేంద్రం వద్ద సీఆర్‌పీఎఫ్ జవాన్లు, స్థానికులకు మధ్య క్యూ విషయంలో గొడవ జరిగి 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.
కామరూప్ జిల్లా ఛాయ్‌గాన్‌లో గర్భిణీ మహిళతో సీఆర్పీఎఫ్ జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిస్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. బెంగాల్లో మొత్తం 31 నియోజకవర్గాల్లో దాదాపు 79.56 శాతం ఓటింగ్ నమోదైంది. ఎండను లెక్క చేయకుండా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు.