
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొఘల్ రోడ్డు, శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శ్రీనగర్‌లో 2.9 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైందని, లేహ్‌లో మైనస్ 6.4 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ‘మొఘల్ రోడ్డును మూసివేశాం.
పూంచ్, షోపియాన్ జిల్లాల నుంచి ఒక్క వాహనాన్ని కూడా వెళ్లనివ్వలేదు’ అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ అస్లామ్ తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో శుక్రవారం రాత్రి 2 అంగుళాల మేర మంచు కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కుప్వారాలో అత్యధికంగా 8.9 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వెల్లడించింది.