శ్రావణ శోభ | Hindu holy sravana masam | Sakshi
Sakshi News home page

శ్రావణ శోభ

Published Sat, Jul 26 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

Hindu holy sravana masam

సాక్షి, ముంబై : హిందువుల పవిత్రమైన శ్రావణ మాసం శనివారం ప్రారంభమైంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు రాష్ట్రంలోని దేవాలయాలు ముఖ్యంగా శివాలయాలన్నీ ముస్తాబు అయ్యాయి.  అనేక మంది ఉపవాస దీక్షలు చేయడంతోపాటు తమ ఇష్టదైవాలను ఎంతో నిష్టతో ఆరాధిస్తారు. ఈ మాసంలో దేవిదేవతలను పూజిస్తే తమ కోరికలు త్వరగా నేరవేరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ సారి శ్రావణమాసంలో అయిదు సోమవారాలు రానున్నాయి.

 ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలను గురించి తెలుసుకుందాం...
 ఐదు క్షేత్రాల ప్రాశస్త్యం
 దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయిదు మహారాష్ట్రలోనే ఉండడం విశేషం.  వీటిలో ఔండా నాగనాథ్, భీమాశంకర్, గశ్నేశ్వర్, పరళి వైద్యనాథ్, త్రయంబకేశ్వర్  పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.  

 త్రయంబకేశ్వర్....
 జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. నాసిక్ జిల్లాలో ఉన్న ఈ త్రయంబకేశ్వర్‌లోని జ్యోతిర్లింగానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముఖాలున్నాయి.  జ్యోతిర్లింగాన్ని మూడు త్రిమూర్తుల ముఖాలున్న స్వర్ణ కిరీటంతో అలంకరించారు. పాండవుల కాలం నుంచి ఈ కిరీటాన్ని అలంకరిస్తున్నట్లు స్థానికంగా చెబుతారు. ఈ దేవాలయాన్ని నల్లరాతితో అద్భుత రీతిలో నిర్మించారు.  మహా శివరాత్రి, శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలను నిర్వహిస్తారు.

 భీమశంకర్....
 భీమశంకర్ దేవాలయాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలనుసారం తెలుస్తోంది. ఈ దేవాలయానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని నానా పద్‌నివాస్ 18 శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. భీమాశంకర్ దేవాలయాన్ని నాగరా పద్ధతిలో రూపొందించారు. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమాశంకర్ గర్భ గుడి కూడా కిందికి ఉంటుంది. ఈ క్షేత్రం పుణేకు 128 కిమీ దూరంలోఉంది.  భీమా నదీ తీరంలో ఉండడంతోనే భీమాశంకర్ క్షేత్రంగా  పేరువచ్చిందని పేర్కొంటారు.

 గశ్నేశ్వర్.......
 ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ గశ్నేశ్వర్ క్షేత్రాన్ని  ఇండోర్‌ను పాలించే అహల్యాబాయి హోల్కర్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. గశ్నేశ్వర్ క్షేత్రాన్ని గశ్నేశ్వర్, కుస్నేశ్వర్ క్షేత్రమని కూడా పిలుస్తారు.  కుసుమ అనే మహిళ తన కొడుకు ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శివలింగాన్ని చేతులో పట్టుకొని కోనేరులో మునిగి శంకరుడిని గూర్చి ఘోర తపస్సు చేసింది.  ఆది దేవుడు ప్రత్యక్షమై ఆమెకు పుత్ర భిక్ష పెట్టాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి గశ్నేశ్వర క్షేత్రంగా పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.  

 ఔండా నాగనాథ్ ...
 ఈ క్షేత్రం రాష్ట్రం లోని హింగోళి జిల్లాలో ఉంది. ఔండా నాగనాథ్ క్షేత్రాన్ని గూర్చి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంత్ జ్ఞానేశ్వర్, విసోబా కేచర, వార్కరీ (భక్తుల సముదాయం) కలిసి భజనలు చేస్తుండగా నాగనాథ్ గుడిలో పూజారి బయటకువచ్చి పూజకు అంతరాయం కలుగుతోందని దూరంగా వెళ్లండని చెప్పాడు. వారు గుడి వెనకకు వెళ్లి తమ భజనలను కొనసాగిస్తారు. వారి భజనలకు ముగ్ధుడెన శివుడు హఠాత్తుగా గుడిని వారివైపునకు తిప్పి భజనలు వింటాడు. ఈ కారణంగా ఈ క్షేత్రంలో నంది దేవాలయం వెనుక భాగంలో దర్శనమిస్తోంది.

 పర్లీ వైద్యనాథ్...
 బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైద్యనాథ్ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారనేది కచ్చితంగా తెలియకపోయినా  క్రీ.శ.1706 లో అహల్యాదేవి హోల్కర్ పునః నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.  పర్లీ వైద్యనాథ్ చుట్టు పక్క ప్రాంతాలు మొత్తం అడవులు, కొండలు, నదులు, ఉపయోగకరమైన ఔషధ మొక్కలతో ఉంటుంది. ఈ కారణంగా  పర్లీ జ్యోతిర్లింగ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది.  పర్లీ వైద్యనాథ్ క్షేత్రానికి సంబంధించి పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement