
హిట్ అండ్ రన్ కేసులో బిజినెస్‌మెన్ అరెస్ట్
న్యూఢిల్లీ :
మెర్సిడిస్ హిట్ అండ్ రన్ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల బిజినెస్‌మెన్ సవ్నీత్ సింగ్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్‌పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని రాజౌరీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మెర్సిడిస్ కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో సవ్నీత్ సింగ్ పీకల్లోతు వరకు తాగి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సవ్నీత్ సింగ్ తన స్నేహితునితో కలిసి రెస్టారెంట్‌కు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.