హనీప్రీత్‌ అరెస్ట్‌ | Honey preet arrest | Sakshi
Sakshi News home page

హనీప్రీత్‌ అరెస్ట్‌

Published Wed, Oct 4 2017 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

Honey preet arrest - Sakshi

చండీగఢ్‌: దాదాపు నెల రోజులుగా పోలీసులకు దొరకకుండా వస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ దత్త పుత్రిక ప్రియాంక తనేజా అలియాస్‌ హనీప్రీత్‌ ఇన్సాన్‌ను ఎట్టకేలకు హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం కేసులో గుర్మీత్‌ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమెను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌–పాటియాలా మార్గంలో అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ బీఎస్‌ సంధూ తెలిపారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హనీప్రీత్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పంచకుల పోలీసు కమిషనర్‌ ఏఎస్‌ చావ్లా వెల్లడించారు. పంచకులలో చెలరేగిన హింసలో ఆమె ప్రమేయంపై విచారిస్తామన్నారు. అదృశ్యం తర్వాత ఎవరెవరు హనీప్రీత్‌కు సహకరించారు అనే విషయాన్నీ విచారిస్తామని చెప్పారు. బుధవారం ఆమెను పంచకులలోని కోర్టులో ప్రవేశపెట్టి పోలీసు రిమాండ్‌కు కోరతామని తెలిపారు. హనీప్రీత్‌తోపాటు ఉన్న మరో మహిళను కూడా కస్టడీలోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు.

నేను, మా నాన్న అమాయకులం..
అరెస్టుకు కొద్ది గంటల ముందే హనీప్రీత్‌ రెండు ప్రముఖ వార్తా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పంచకుల అల్లర్లకు తనను బాధ్యురాలిని చేస్తూ కేసు నమోదు చేయడం ఆవేదన కలిగించిందని హనీప్రీత్‌ చెప్పారు. హరియాణా పోలీసులు తనపై అన్యాయంగా లుక్‌ఔట్‌ నోటీసులు, ఆ తర్వాత అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు.

‘‘నేను అల్లర్లు ప్రోత్సహించేలా కనిపిస్తున్నానా? అలా ఎలా ఆరోపణలు చేస్తారు?. నా తండ్రికి శిక్ష పడిన రోజు ఒక కూతురుగా ఆయన పక్కన ఉన్నాను. నేను ప్రజలను రెచ్చగొడుతూ ఒక్క మాట అయినా పలికానా.. అలాంటప్పుడు నన్ను నిందితురాలిగా ఎలా పేర్కొంటారు. నేను చట్టం కళ్లుగప్పి ఎక్కడికి పారిపోలేదు. పంచకులలో చెలరేగిన హింసకు నన్ను బాధ్యురాలిని చేయడంతో పూర్తిగా కుంగిపోయాను. నా తండ్రి నిర్దోషిగా బయటకు వస్తారనే ఆశతోనే ఆ రోజు కోర్టుకు వెళ్లాను.

కానీ దురదృష్టవశాత్తు ఆయనకు శిక్ష పడింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాను. పూర్తిగా షాక్‌లో ఉండిపోయాను. అలాంటి విపత్కర సమయంలో మిగతావాటి గురించి ఎలా ఆలోచించగలను. ఒక్కసారి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నా తండ్రితో కలసి దేశ భక్తి సినిమాలు తీశాను. అలాంటి నాపై దేశ ద్రోహం ఆరోపణలు చేశారు. అంతపెద్ద ఆరోపణలు జీర్ణించుకోలేకపోయాను. నేను కనీసం చీమను కూడా చంపను. నాకు న్యాయ ప్రక్రియ అంటే అర్థం కూడా తెలీదు. నా వరకు నా తండ్రి గుర్మీత్‌ జైలు వెళ్లడం ఎంతో బాధించింది.

నా ప్రపంచం మొత్తం కుప్పుకూలినట్లైంది. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. కొంతమంది ఇచ్చిన సూచనల ప్రకారం ఢిల్లీకి వెళ్లాను. ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయిస్తాను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉంది. తప్పక న్యాయం జరుగుతుంది. గుర్మీత్‌తో అక్రమ సంబంధం గురించి నా మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా చేసిన ఆరోపణల గురించి నేను మాట్లాడను. గుర్మీత్‌కు, నాకు మధ్య పవిత్ర బంధం ఉంది. మా మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారు.

ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రీకూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా తండ్రి అమాయకుడు. రానున్న రోజుల్లో ఆ విషయం అందరూ తెలుసుకుంటారు. డేరా కార్యాలయంలో కొందరు శిష్యురాళ్ల మృతదేహాలను పూడ్చిపెట్టారంటున్నారు. ఇంతవరకు ఒక్క అస్థిపంజరాన్ని అయినా గుర్తించారా? లేదు కదా’’ అని హనీప్రీత్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement