సాక్షి, న్యూఢిల్లీ: రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ గురించి రోజుకొక రహస్యం వెలుగులోకి వస్తోంది. గుర్మీత్, హనీప్రీత్ రహస్యంగా సంతానం కలిగి ఉండాలని కోరుకున్నారట. తమకు కొడుకు పుడితే.. డేరా స్వచ్ఛసౌదాకు అతన్ని వారసుడిగా కొనసాగించవచ్చునని భావించారట. కానీ, వారి రహస్య వారసుడి ప్లాన్ వర్కౌట్ కాలేదని డేరా ఫాలోవర్లు చెప్తున్నారు. గుర్మీత్, హనీప్రీత్ మధ్య రహస్య అనుబంధం గురించి వారు పలు విస్మయకర వాస్తవాలను తెలిపారు.
డేరాలో హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం..
గుర్మీత్ చాటుగా హనీప్రీత్ రాసలీలలు నడిపేవాడని, వారి మధ్య శారీరక సంబంధం ఉందని ఇప్పటికే పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డేరా శిష్యులు వీరి అనుబంధం గురించి పలు విషయాలు వెల్లడించారు. హనీప్రీత్ గుర్మీత్ సన్నిహిత సహచరిగా మారకముందు.. గుహాలో ఆమెపై గుర్మీత్ అత్యాచారం జరిపాడని తెలిపారు. తన ప్రైవేటు చాంబర్ అయిన గుహాలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ అత్యాచారం జరిపిన కేసులో శిక్ష ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సాధ్వీల తరహాలోనే హనీప్రీత్‌పై కూడా గుర్మీత్ లైంగిక దాడి జరిపారని, కానీ గుర్మీత్ బెదిరింపులకు తలొగ్గి.. ఆ తర్వాత ఆయన నుంచి పలు ప్రయోజనాలు పొంది.. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచి ఉంటుందని డేరా శిష్యులు చెప్తున్నారు.
ఓ రోజు హనీప్రీత్ గుహలోకి వెళుతుండటం తాము చూశామని, ఏడుస్తూ ఆమె గుహ నుంచి బయటకు వచ్చిందని వస్తూ ఆమె గుర్మీత్ మాజీ డ్రైవర్లు అయిన ఖట్టా సింగ్, అతని కొడుకు గురుదాస్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజున తాను, తన కజిన్ గుహకు రక్షణగా ఉన్నామని గురుదాస్ చెప్పారు. 'హనీప్రీత్ చాలా ఆందోళనగా కనిపించింది. ఆమె నేరుగా డేరాలో క్యాషియర్‌గా పనిచేస్తున్న తన తాత దగ్గరికి పరిగెత్తుకెళ్లింది. ఆమె తాత గొడవ చేయకుండా గుర్మీత్ గూండాలు చూశారు' అని ఆయన చెప్పారు.
వారసుడి కోసం ప్రయత్నించారు.. కానీ!
గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ రహస్యంగా వారసుడి కోసం ప్రయత్నాలు చేశారు. తమకు కొడుకు పుట్టాలని, అతన్ని డేరా సామ్రాజ్యానికి వారసుడిని చేయాలని వారు భావించారు. గుర్మీత్ సొంత కొడుకు జస్మీత్ సింగ్‌ను డేరా వారసుడిగా ప్రకటించాలన్న వాదనను హనీప్రీత్ ఒప్పుకునేది కాదని, తమ కొడుకుకే వారసత్వ పట్టాం కట్టాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని గుర్మీత్ మాజీ శిష్యుడు గురుదాస్ సింగ్ తోర్ తెలిపారు. 2007లో జస్మీత్‌ను డేరా వారసుడిగా గుర్మీత్ ప్రకటించినప్పటికీ.. హనీప్రీత్ ఒత్తిడితో తన నిర్ణయాన్ని గుర్మీత్ మార్చుకున్నాడని, అయితే, అనుకోని పరిస్థితులు.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వారసుడి ప్రయత్నాలకు బ్రేక్ పడిందని తెలిపారు. 2002లో డేరాలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ సాక్షిగా ఉన్న తోర్.. గుర్మీత్-హనీప్రీత్ అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ ఇద్దరూ డేరాలో భార్యాభర్తల్లాగే గడిపేవారని చెప్పాడు. ఇదే విషయాన్ని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. డేరాలోని ప్రైవేటు చాంబర్‌లో గుర్మీత్-హనీప్రీత్ శృంగారానికి పాల్పడే వారని, ఆ సమయంలో డేరా బయట తాను వేచి ఉండే వాడినని గుప్తా గతంలో మీడియాకు చెప్పారు.