సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులు దాటినా డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ జాడ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇందుకు కారణం పోలీసుల తనిఖీల సమాచారం హనీప్రీత్‌కు అందడేనని నిఘావర్గాలు భావిస్తున్నాయి. గత ఆగస్టు 25వ తేదీన అత్యాచారాల కేసులో గుర్మీత్‌ను దోషిగా తేల్చాక హరియానాలో అల్లర్లు జరిగాయి. ఆపై డేరాలలో జరుగుతున్న అకృత్యాలు, మరిన్ని ఆరోపణలపై తనను అరెస్ట్ చేస్తారని భయాందోళనకు గురై హనీప్రీత్ పరారైంది. ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకోవాలని చూస్తున్న తరుణంలో సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది.
గత 33 రోజుల నుంచి ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నా ఆమె జాడ తెలియడం లేదు. కొందరు అనుచరులు ఆమెకు పోలీసు తనిఖీల సమాచారం లీకులిస్తున్న కారణంగానే ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నాట్లు భావిస్తున్నారు. వాస్తవానికి గుర్మీత్‌కు శిక్షపడ్డ ఆగస్టు 25న, ఆ మరుసటిరోజు హనీప్రీత్ జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్నారు. ఆ తర్వాత ఆమె మద్ధతుదారులు, గుర్మీత్ అనుచరుల సాయంతో ఆమె పరారైన విషయం తెలిసిందే.
కొందరు అనుచరుల సాయంతో హనీప్రీత్ ఎప్పటికప్పుడూ తన మకాం మారుస్తోందని, అవసరమైతే దేశం దాటి వెళ్లిపోయేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పరారవుతూ తనగోతిని తానే తవ్వుకుంటుందని హనీప్రీత్‌ను ఉద్దేశించి అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) మహమ్మద్ అకిల్ వ్యాఖ్యానించారు. అయితే త్వరలో ఆమెను అదుపులోకి తీసుకోవడం ఖాయమని చెప్పారు. ఆమెకు సాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.