
శ్రీనగర్ : కరోనా పరీక్షలో నెగిటివ్ తేలిన 12 మందికి మూడు రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో పనిచేసే 12 మంది కార్మికులకు కరోనా లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.
పదిరోజుల అనంతరం నిర్వహించిన రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా మొదటిసారి ఫలితాల్లో నెగిటివ్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికి వారు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ భూపిందర్ కుమార్‌ని సంప్రదించగా.. తనకు ఈ సంఘటన గురించి తెలియదన్నారు. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్ )
ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగానే తాము పరీక్షలు నిర్వహించామని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. బాధితులు జూలై 1న వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆసుపత్రిలోనే చికిత్స అందించామని తెలిపారు. నిబంధనల ప్రకారం వైరస్ నిర్ధారణ అయిన 10 రోజుల అనంతరం రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే, పరీక్షలోనూ నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయొచ్చని.. దానికనుగుణంగానే తాము చేసినట్లు పేర్కొన్నారు. నిజానికి కరోనా సోకిన వ్యక్తికి 10 రోజుల అనంతరం లక్షణాలు లేకపోతే రెండుసార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగిటివ్ వస్తే వైరస్ లేనట్లు. అంటే వారిని డిశ్చార్జ్ చేయొచ్చు. కశ్మీర్ ఆస్పత్రి సిబ్బంది మాత్రం రెండోసారి ఫలితాలు రాకముందే వారందరినీ ఇళ్లకు పంపించేశారు. దీంతో వారు ఇప్పుడు ఎవరెవరిని కలిసారన్న దానిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. (అమర్నాథ్ యాత్ర రద్దు )
Comments
Please login to add a commentAdd a comment