‘చల్తాహై’కి కాలం చెల్లింది | Huge expectations on India: PM Modi | Sakshi
Sakshi News home page

‘చల్తాహై’కి కాలం చెల్లింది

Published Sun, Sep 18 2016 1:56 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

‘చల్తాహై’కి కాలం చెల్లింది - Sakshi

‘చల్తాహై’కి కాలం చెల్లింది

నిర్లిప్త ధోరణి వీడాలి
భారత్‌పై భారీ అంచనాలున్నాయి: ప్రధాని మోదీ

 
- గిరిజనులు, దివ్యాంగుల సమక్షంలో ప్రధాని పుట్టినరోజు వేడుకలు
- ఉదయమే తల్లి ఆశీర్వాదం తీసుకున్న  మోదీ
- దివ్యాంగుల కోసం 2 ఏళ్లలో 4 వేల శిబిరాలు: మోదీ
 
 గాంధీనగర్: ప్రజల్లో ‘హోతా హై, చల్తా హై’(నిర్లిప్త) ధోరణి మారాలని, ప్రపంచమంతా భారీ అంచనాలతో భారత్‌ను గమనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన తన 66వ పుట్టినరోజును గుజరాత్‌లో గిరిజనులు, దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వరుసలో ఉన్న చివరి వ్యక్తి సాధికారతకు సైతం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీనిచ్చిన ఆయన దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. శనివారం ఉదయమే గాంధీనగర్ రేసన్ ప్రాంతంలో తమ్ముడు పంకజ్ మోదీతో ఉంటున్న తల్లి వద్దకు వె ళ్లి ఆశీర్వచనాలు పొందారు.  25 నిమిషాలు అక్కడ గడిపారు. భద్రతా సిబ్బంది, అధికారులు ఎవరూ వెంట లేకుండానే కేవలం ఒక్క కారులోనే తల్లి ఇంటికి మోదీ వెళ్లడం విశేషం.

ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు విదేశీ నేతలు కూడా  ప్రధానిని పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో బస చేసిన ప్రధాని ముందుగా దహోడ్ జిల్లాలోని లిమ్‌ఖేడాలో పర్యటించి గిరిజనులను పలకరించారు.   వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే గుజరాత్‌లో రెండు నెలల వ్యవధిలో మూడోసారి పర్యటించిన మోదీ... ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,817 కోట్లతో నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. దేశ స్వాతంత్రోద్యమంలో గిరిజనుల పాత్రను కొనియాడారు. గిరిజనులకు సరిపడా తాగు, సాగునీరు సరఫరా చేస్తామని హామీనిచ్చారు.

 గిరిజనులకు వీలైనంత సాయం చేస్తాం
 ‘ఒకప్పుడు నీటి కొరతతో గిరిజన సోదరులు వలస పోయేవారు. తీవ్రమైన ఎండలో నిర్మాణ కార్మికులుగా ఎంతో ఇబ్బందిపడేవారు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం నీటి సరఫరాకు ప్రాధాన్యమిచ్చింది. నీటి ప్రాజెక్టులకు అత్యధిక కేటాయింపులు చేశాం. ఈరోజు తాగు, సాగునీటి కోసం వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుల్ని ప్రారంభించాం’ అని మోదీ పేర్కొన్నారు. వివిధ పథకాల్లో భాగంగా గిరిజన జీవితాల అభివృద్ధికి సాధ్యమైనంత సాయం చేస్తానని చెప్పారు. ‘ఎన్డీఏ ఎంపీలు ప్రధానమంత్రిగా ఎన్నుకొన్న వ్యక్తి ఈ గుజరాత్ నేలకు చెందిన పుత్రుడే... నా ఎదుగుదలకు మీరంతా తొడ్పడ్డారు’ అంటూ గిరిజనులను ప్రశంసించారు. గతంలో దహోడ్ జిల్లాలో స్కూటర్‌పై తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధీ చేయలేదని, అప్పట్లో పథకాలన్నీ కేవలం కాగితాలపైనే ఉండేవని, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం దహోడ్‌లో రైల్వే యార్డ్ నిర్మాణాన్ని చేపట్టిందని, దానివల్ల అనేకమందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022 నాటికి తమ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తుందన్నారు.

 దివ్యాంగుల శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉంది
 అనంతరం నవ్‌సారీలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ‘కళ్ల ముందు జరగుతున్న విషయాలపై నిర్లిప్త భావన దేశానికి మంచిది కాదు. ప్రపంచమంతా భారీ అంచనాల మధ్య భారత్‌ను ఆసక్తిగా చూస్తోంది. వివిధ పరిస్థితుల పట్ల యంత్రాంగం స్పందించే తీరులో గణనీయ మార్పు రావాలి’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆర్థిక సాయంతో పాటు, ప్రత్యేక పరికరాలను అందచేశారు. గత ప్రభుత్వాల హయాంలో 57 త్రిచక్రవాహన పంపిణీ  శిబిరాల్నే నిర్వహించారని, ఎన్డీఏ హయాంలో రెండేళ్లలో 4 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇలాంటి శిబిరంలో ఒక ప్రధాని మొదటిసారి పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల్ని ప్రధాని అభినందించారు. దివ్యాంగ చిన్నారులతో మోదీ కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్, సహాయ మంత్రులు పాల్గొన్నారు.
 
 శుభాకాంక్షల వెల్లువ
 శనివారం ట్విటర్‌లో మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ శుభాకాంక్షలు చెప్పి ఫోన్ చేసి మాట్లాడారు. మోదీ, భారత్ గొప్ప విజయాలు సాధించే ఏడాదికి ఈ రోజు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. వెనెజులాలో ఉన్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని ప్రచండ, అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ్రఘనీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గాంధీనగర్‌లో రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ, పలు రాష్ట్రాల సీఎంలు, క్రీడా ప్రముఖులు సచిన్,  సింధు తదితరులు కూడా ట్వీట్ చేశారు. వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
 
 మూడు గిన్నిస్ రికార్డులు
 ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మూడు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ చెప్పారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సారీలో శుక్రవారం 989 మంది 30 సెకన్ల వ్యవధిలో ప్రమిదలు వెలిగించి రికార్డు నెలకొల్పారని తెలిపారు. ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 1000 మంది దివ్యాంగులు చక్రాల కుర్చీలతో వీల్‌చైర్ లోగో ఏర్పాటు, అలాగే ఒక్కచోటే 1,700 మందికి 3,400 వినికిడి యంత్రాలు అందచేయడం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిందని మంత్రి చెప్పారు. మూడు రికార్డుల్ని గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement