సాక్షి, బెంగళూరు: దేశమంతటా సామాన్యులు ఉల్లిని కొనలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుండగా కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఉల్లికి ఏర్పడిన భారీ డిమాండ్ కర్ణాటకకు చెందిన రైతు మల్లికార్జున (42)ను కోటీ శ్వరుణ్ని చేసింది. పంట వేయడం కోసం తీసుకున్న అప్పు చెల్లించడమేగాక భూమి కొనుగోలుకు, ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని దొడ్డసిద్ధవ్వనహళ్లికి చెందిన ఆయన తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలను లీజుకు తీసుకొని ఉల్లి సాగు చేశారు. దీనికి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ. 5 నుంచి 10 లక్షల లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే నవంబర్ నుంచి అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలు ఆయనకు భారీ లాభం వచ్చేలా చేశాయి.
దాదాపు 240 టన్నుల ఉల్లిని ఆయన అమ్మారు. ఉల్లి ధర కిలో రూ. 200 దాకా వెళ్లడంతో రాత్రికిరాత్రే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. అయితే దీని కోసం బాగా శ్రమించాల్సి వచ్చిందని, 50 మంది పనివారిని పెట్టి పంట పండించామని చెప్పారు. ఉల్లి డిమాండ్ పెరిగినపుడు దొంగల బారిన పడకుండా కుటుంబమంతా కాపలాగా ఉన్నామని చెప్పారు. అక్టోబర్‌లో ధరలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భయపడ్డామని చెప్పారు. అయితే తర్వాత క్వింటాల్ ఉల్లి ధర రూ. 7 వేల నుంచి 12 వేలకు పెరగడంతో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment