karodpatis
-
రైతును కోటీశ్వరుణ్ని చేసిన ఉల్లి
సాక్షి, బెంగళూరు: దేశమంతటా సామాన్యులు ఉల్లిని కొనలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుండగా కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఉల్లికి ఏర్పడిన భారీ డిమాండ్ కర్ణాటకకు చెందిన రైతు మల్లికార్జున (42)ను కోటీ శ్వరుణ్ని చేసింది. పంట వేయడం కోసం తీసుకున్న అప్పు చెల్లించడమేగాక భూమి కొనుగోలుకు, ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని దొడ్డసిద్ధవ్వనహళ్లికి చెందిన ఆయన తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలను లీజుకు తీసుకొని ఉల్లి సాగు చేశారు. దీనికి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ. 5 నుంచి 10 లక్షల లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే నవంబర్ నుంచి అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలు ఆయనకు భారీ లాభం వచ్చేలా చేశాయి. దాదాపు 240 టన్నుల ఉల్లిని ఆయన అమ్మారు. ఉల్లి ధర కిలో రూ. 200 దాకా వెళ్లడంతో రాత్రికిరాత్రే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. అయితే దీని కోసం బాగా శ్రమించాల్సి వచ్చిందని, 50 మంది పనివారిని పెట్టి పంట పండించామని చెప్పారు. ఉల్లి డిమాండ్ పెరిగినపుడు దొంగల బారిన పడకుండా కుటుంబమంతా కాపలాగా ఉన్నామని చెప్పారు. అక్టోబర్‌లో ధరలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భయపడ్డామని చెప్పారు. అయితే తర్వాత క్వింటాల్ ఉల్లి ధర రూ. 7 వేల నుంచి 12 వేలకు పెరగడంతో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. -
వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో కరోడ్‌పతిల సంఖ్య ఇపుడు హాట్ టాపిగా నిలిచింది. అయితే టీసీఎస్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తోందన్న ఆరోపణలను టాటా గ్రూపులో మరో సంస్థ టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. టీసీఎస్ వృద్ధికి, అద్భుతమైన ఫలితాలను సాధించిన ఘనత టీసీఎస్ మేనేజ్మెంట్కు దక్కు తుందన్నారు. ఇందుకు వారికి తగిన ప్రతిఫలం అందివ్వాలని సంస్థ భావించిందని చెప్పారు. ఉద్యోగులను నిలుపుకోవడంపై ప్రధానంగా తాము ఎక్కువ దృష్టి పెట్టామని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. అలాగే నూతన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి-ఆధారిత కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే డిజిటల్ ఇండియా చొరవను పునరుద్ఘాటించే అవకాశం ఉందన్నారు. కరెన్సీలో దీర్ఘ కాల స్థిరత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. టీసీఎస్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు టీసీఎస్‌లోనే కరీర్ ప్రారంభించినవారు కావడం విశేషం. ఈ వివరాలను ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌లో కోటిపైగా వార్షిక వేతనం అందుకున్నవారి సంఖ్య 91. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సీఈవో రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టిసిఎస్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ డెబాషిస్ ఘోష్ రూ .4.7 కోట్లు సంపాదించారు; బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం రూ .14.1 కోట్లు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కె. కృతివాసన్ సంవత్సరానికి రూ .4.3 కోట్లకు పైగా వేతనాన్ని అందుకున్నారు. రూ.1 కోటికిపైగా జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ బరీంద్ర సన్యాల్ (72)గా ఉండగా, అతి తక్కువ వయస్కులు 40 ఏళ్ల వయసు ఉద్యోగి. కాగా ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది. స్టాక్‌మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ ఇన్ఫోసిస్ మాదిరిగా టిసిఎస్ ఉద్యోగులకు స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు లభించవు. -
కోటీశ్వరులు ఎంత శాతం పెరిగారో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కోటీశ్వరులు సంఖ్య పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో కరోడ్ పతిల సంఖ్య భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత పన్నులు చెల్లిస్తున్నవారు గత నాలుగేళ్లలో 1.40లక్షల మంది పెరిగారని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కల ప్రకారం కోటి పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య సుమారు 60శాతం పెరుగుదలను నమోదు చేసిందని తెలిపింది. గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులచెల్లింపుల గణాంకాలను సీబీడీటీ సోమవారం ప్రకటించింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పుంజుకుందని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా గత మూడేళ్లలో పన్ను చెల్లింపు దారుల నమోదు భారీగా పెరిందని తెలిపారు. కోటి రూపాయల ఆదాయాన్ని చూపిస్తూ (కార్పొరేట్లు, సంస్థలు, హిందూ డివైడెడ్ ఫ్యామిలీస్ తదితరులు) ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి మొత్తం సంఖ్య ఏటా 68 శాతం పెరిగిందన్నారు. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 55 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014-15 లో రూ. 32.28 లక్షల తో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో సగటు పన్ను రూ .49.95 లక్షలకు పెరిగింది. సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ్య 37శాతం పెరిగింది. అలాగే నాన్ సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ్య 19శాతం వృద్ధిని నమోదు చేసింది. -
కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
► ఆస్తుల సగటులోనూ ఏపీ మంత్రులదే మొదటి స్థానం ► మంత్రులపై క్రిమినల్ కేసుల్లో మూడోస్థానంలో తెలంగాణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై ఓ సంస్థ చేసిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలపై విశ్లేషణ జరిపిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలు తెలిపింది. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్(రూ. 251 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ. 45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర(రూ. 31.67 లక్షలు)గా నిలిచింది. 34 శాతం రాష్ట్రాల మంత్రులు (210 మంది)లపై క్రిమినల్ కేసులున్నాయి. 113 మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్ర కేసులున్నాయి. ఈ జాబితాలో 18మంది మంత్రులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, బిహార్(11), తెలంగాణ(9), జార్ఖండ్ (9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 609 మందిలో 51 మంది మహిళా మంత్రులుండగా.. వీరిలో అత్యధికం మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచే ఉన్నారు. అటు కేంద్ర మంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులుండగా.. సగటు ఆస్తి రూ. 12.94 కోట్లుగా వెల్లడైంది.