ఉగ్ర వేట మొదలైంది! | Hunting started for Abu Ismail | Sakshi
Sakshi News home page

ఉగ్ర వేట మొదలైంది!

Published Thu, Jul 13 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

ఉగ్ర వేట మొదలైంది!

ఉగ్ర వేట మొదలైంది!

► ఇస్మాయిల్‌ కోసం రంగంలోకి బీఎస్‌ఎఫ్, ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్‌
► 50 కిలోమీటర్ల మేర డ్రోన్లతో గాలింపు
► దాడిలో ఇద్దరు పాకిస్తానీలు.. ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు  


జమ్మూ: కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబూ ఇస్మాయిల్‌ (35) కోసం భద్రతాదళాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)కు చెందిన ఇస్మాయిల్‌ వేటలో ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీ స్, సీఆర్పీ ఎఫ్, ఎన్‌ఐఏ, బీఎస్‌ఎఫ్‌కు చెందిన దాదాపు 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు చేస్తున్న లష్కరే తోయిబా కమాండర్‌ ఇస్మాయిల్‌ ఆచూకీపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ కుమార్‌ దోవల్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఇస్మాయిల్‌ రెండేళ్ల క్రితం పాక్‌ నుంచి దక్షిణ కశ్మీర్‌ వచ్చి లష్కర్‌ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ఇస్మాయిల్‌ దాగి ఉన్నాడని భావిస్తున్న ప్రాంతంలోని 50 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వినియోగస్తున్నారు. నలుగురు ఈ ఉగ్రదాడిలో పాల్గొని ఉంటారని ఇందులో ఇద్దరు పాకిస్తాన్‌ జాతీ యులను విచారణ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటన అనంతరం వీరు ద్విచక్రవాహనాలపై పారిపోయి ఉంటా రని భావిస్తున్నారు.

లష్కరే కమాండర్‌ బషీర్‌ను భద్రతా దళాలు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా అమర్‌నాథ్‌ యాత్రికుల ఊచకోతకు ఇస్మాయిల్‌ పథకం రూపొందిం చాడని భావిస్తున్నారు. అటు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం లోయలో హై అలర్ట్‌ ప్రకటిం చింది. మరోవైపు, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, హన్స్‌రాజ్‌ ఆహిర్‌ బుధవారం కశ్మీర్‌లో పర్యటించారు. భద్రతాదళ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తాలతో చర్చించారు. తాజా పరిస్థితులపై సమీక్ష జరిపారు.

చావనైనా చస్తాం.. యాత్ర పూర్తి చేస్తాం!
అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి ప్రభావం అమర్‌నాథ్‌ యాత్రికులపై ఏమాత్రం కనిపించటం లేదు. ఉగ్ర ఘటన నేపథ్యంలోనూ 3,791 మంది యాత్రికులు జమ్మూనుంచి అమర్‌నాథ్‌ బేస్‌ క్యాంప్‌నకు బయలుదేరారు. బుధవారం ఉదయం సీఆర్పీఎఫ్‌ బలగాల సంరక్షణలో 150 వాహనాల శ్రేణి జమ్మూ నుంచి బయలుదేరింది. ‘భం భం భోలే’ నినాదాలు చేస్తూ యాత్రికులు ఉత్సాహంగా యాత్ర ప్రారంభించారు. ‘మేం భయపడం. ఎలాంటి సమస్యలు ఎదురైనా అమర్‌నాథ్‌ యాత్ర పూర్తి చేస్తాం. చావనైనా చస్తాం.. గానీ యాత్ర చేయకుండా ఇళ్లకు తిరిగి వెళ్లం’ అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సతీశ్‌ చందర్‌ అనే యాత్రికుడు తెలిపారు. బుధవారం వరకు 1,56,618 మంది యాత్రికులు అమర్‌నాథ్‌ మంచు లింగాన్ని దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement