
బస్సులేమో కాలుష్య భూతాలు. విద్యుత్ వాహనాలు వాడదామంటే ఖరీదెక్కువ. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివిలాగా అన్నమాట. ఇక పెట్రోల్, డీజిల్ వాహనాలతో కాలుష్యం ఎక్కువని గ్యాస్ వాహనాలు వాడుతున్న విషయం తెలిసిందే. ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలతోనూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి తరుణోపాయం? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పరిశోధనల పుణ్యమాని ఇప్పుడు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం దొరికింది. దాని పేరు.. హెచ్ సీఎన్జీ. ఏమిటది? మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఐవోసీ పరిశోధనల్లో అన్ని ఇంధనాల కంటే మెరుగైనదిగా రుజువైన హైడ్రోజన్‌ను సీఎన్జీతో తగు మోతాదులో కలిపితే కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఐవోసీ గుర్తించింది. విస్తృత పరిశోధనల తర్వాత 18 శాతం హైడ్రోజన్, 82 శాతం సీఎన్జీ మిశ్రమంతో గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని నిర్ధారణకు వచ్చింది.
ఇవీ లాభాలు...
హెచ్ సీఎన్జీ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందని ముందే చెప్పుకున్నాం. కొంచెం వివరంగా చూస్తే.. ఈ కొత్తతరం ఇంధనం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 70 శాతం (సీఎన్జీతో పోలిస్తే) తగ్గిపోతాయి. అంతేకాదు మైలేజీ 3 నుంచి 4 శాతం పెరుగుతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న బస్సుల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకపోవడం, సీఎన్జీ స్టేషన్లలో హైడ్రోజన్ ఉత్పత్తికి స్టీమ్ మీథేన్ రిఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటే సరిపోవడం దీంతో వచ్చే అదనపు ప్రయోజనాలు. అయితే కాలుష్య కారక వాయువుల్లో ఒకటైన నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాల్లో మాత్రం తేడా ఉండదు.
పరీక్షలు పూర్తి
హెచ్ సీఎన్జీ ఇంధనంతో ఐవోసీ ఇప్పటికే ప్రయోగాలు పూర్తి చేసింది. ఫరిదాబాద్, హర్యానాల్లో 2 బస్సులపై చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి కూడా. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఐవోసీ సాధించిన ఫలితాలను నిర్ధారించింది. మరిన్ని పరీక్షల కోసం ఐవోసీ మూడేళ్లపాటు ప్రయత్నాలు చేసింది. చివరకు ఢిల్లీలోని 2 బస్సు డిపోల్లో సుమారు 50 బస్సుల్లో హెచ్ సీఎన్జీ ఇంధనం వాడటానికి అవకాశం లభించింది. వీటిని రానున్న ఆరేడు నెలలు పరీక్షించి చూస్తారు. ఫలితాలను బట్టి తగిన మార్పులు చేర్పులు చేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఐవోసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
కిలో హైడ్రోజన్ రూ.840
హెచ్ సీఎన్జీతో ఎన్నో ప్రయోజనాలున్నా.. ప్రస్తుతానికి హైడ్రోజన్ ఉత్పత్తికయ్యే వ్యయం కొంచెం ఎక్కువే. స్టీమ్ మీథేన్ రిఫార్మేషన్ పద్ధతిలో ఒక్కో కిలో హైడ్రోజన్ ఉత్పత్తికి రూ.840 దాకా ఖర్చు అవుతుంది. దీని ఫలితంగా కిలోమీటర్ ప్రయాణానికి 72 పైసలు అధికంగా ఖర్చు అవుతుందని ఐవోసీ ఉన్నతాధికారి ఎస్‌ఎస్‌వీ కుమార్ తెలిపారు. కానీ దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలు చేస్తే మాత్రం ఈ అదనపు ఖర్చు ఉండదని అన్నారు.
హెచ్ సీఎన్జీ సాంకేతికతను ప్రపంచంలో దేశంలోనే తొలిసారి ఉపయోగిస్తున్నారు. దీనిపై పేటెంట్ కూడా మనదే. ఢిల్లీ పరీక్షలు విజయవంతమైతే ఐవోసీ దీన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. నగరాల్లో గ్యాస్ పంపిణీకి మేము ఇప్పటికే కొన్ని టెండర్లు దక్కించుకున్నాం. ఆయా నగరాల్లో ఈ టెక్నాలజీ వాడతాం. – ఎస్‌ఎస్‌వీ కుమార్
Comments
Please login to add a commentAdd a comment