అది ఎప్పటికీ నెరవేరబోదు: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన పట్ల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఈ కేసు ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నదని ఆయన ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యల ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను అడ్డుకోవాలని వారు చూస్తున్నారని, ఇది ఎప్పటికీ జరుగబోదని ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం పాటియాలా కోర్టు విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించినా వారు హాజరుకాకపోవడం గమనార్హం. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడులోని వరద బాధితులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు వెనుక రాజకీయ పరమైన దురుద్దేశం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.