నిందితులను కోర్టుకు హాజరుపరచినప్పటి దృశ్యం
న్యూఢిల్లీ: డానిష్ పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఓ నిందితుడు తాను నపుంసకుడినని కోర్టుకు తెలిపాడు. గతేడాది జనవరి 14న ఢిల్లీలో డానిష్ పర్యాటకురాలు(51)ను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను ప్రధాన సాక్షి, రైల్వే ఉద్యోగి శివాజి సింగ్ గుర్తించారు. ఈ కేసుని ఈ రోజు ఢిల్లీలో ఒక కోర్టు విచారించింది. ఎనిమిది మంది నిందితులపై సామూహిక అత్యాచారం, దోపిడి, హత్యాయత్నం తదితర కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఇద్దరు బాల నేరస్తుల పాత్రపై జువైనల్ బోర్డు విచారణ చేపట్టింది.
జులాయిగా తిరిగే మహేంద్ర సింగ్ అలియాస్ గంజా(24), మహ్ద్ రాజా(22), రాజు(23), అర్జున్(21), రాజు చక్కా(22), శ్యామ్ లాల్(55)లు ఆ రోజు పార్కులో ఒంటరిగా ఉన్న మహిళను చట్టుముట్టారని, వారిలో అర్జున్ ఆమెను కత్తితో బెదిరించగా, మహేంద్ర అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. తనను కూడా కత్తితో బెదిరించటంతో నిస్సహాయ స్థితిలో వెనుదిరిగినట్లు శివాజీ కోర్టుకు వివరించాడు.
నిందితుల్లో ఒకరైన శ్యామ్‌లాల్ తాను నపుంసకుడినని, అత్యాచారానికి పాల్పడలేదని కోర్టుకు తెలిపారు. మరో నిందితుడు అర్జున్ బాలుడినైన తనను గత జనవరి నుంచి పోలీసులు అన్యాయంగా నిర్బందించారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.