లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్‌లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది.
గోపాల్ సే తన కారులోంచి దిగి కంగారుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడు. నేరుగా ఎస్సై రమేష్ కుమార్ దగ్గరకు వెళ్లాడు. ఎస్సైగారూ! ఎలాగైనా మీరే కాపాడాలి. దారుణంగా మోసపోయాను. మీరు నన్ను కాపాడకపోతే నాకు ఆత్మహత్యే దారి.ఆ మాటలు వినగానే కుమార్ షాక్ అయ్యాడు. ఎప్పుడూ హుందాగా, ఠీవిగా దర్పాన్ని ప్రదర్శించే గోపాల్ సేఠేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. ‘‘గోపాల్ సే గారూ! ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? రండి. ముందు కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకుంటారా?’’ అన్నాడు.‘‘ఏమీ వద్దు ఎస్సైగారూ! ముందు నా కంప్లైంట్ తీసుకోండి.. ప్లీజ్..!’’‘‘సరే చెప్పండి. ఏం జరిగింది?’’ అడిగాడు ఎస్సై.గోపాల్ సే పూర్వీకులది కలకత్తా. చాలా ఏళ్ల కిందటే వాళ్ల నాన్న ఇంట్లో గొడవ పడి హైదరాబాద్ వచ్చి నార్తిండియన్లు ఎక్కువగా ఉండే గాంధీనగర్ ఏరియాలో నగల దుకాణం పెట్టాడు. అది దినదినాభివృద్ధి చెంది ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే వాళ్లకు మంచి సంపాదన తెచ్చి పెట్టింది. వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత గోపాల్ సేదాన్ని మరింత అభివృద్ధిలోకి తెచ్చాడు. ఆ ఏరియాలో మిగిలిన అన్ని నగల దుకాణాల కన్నా గోపాల్ సే దుకాణానికి గ్లామరెక్కువ. సిటీలో ఒక పెద్ద మల్టీ ఫ్లోర్ జ్యువెలరీ షాపు ఓపెన్ చేయాలనేది అతని ఆశ. అతని బంధువులంతా కలకత్తాలోనే ఉంటారు.
అందరూ జ్యువెలరీ బిజినెస్‌లోనే ఉన్నారు. అక్కడి వాళ్లకు ఇతను డిజైన్లు పంపడం, అక్కడి డిజైన్లు వాళ్లు ఇతనికి పంపడం ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది.ఎస్సై రమేష్‌కుమార్ ఈ మధ్యనే నిజామాబాద్ నుంచి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చాడు. అతని భార్య అంటే అతనికి ఎనలేని ప్రేమ. ఆమె కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడు. మొన్నామధ్య డీజీపీ ఇంట్లో జరిగిన వేడుకలో డీజీపీ భార్య వేసుకున్న నెక్లెస్ రమేష్‌కుమార్ భార్యకి తెగ నచ్చేసింది. వచ్చే నెలలో జరగబోయే పోలీస్ గెట్ టుగెదర్ పార్టీకి అలాంటిదే కావాలని పట్టుబట్టింది. ఎంక్వైరీ చేస్తే అది గోపాల్ సే షాపు డిజైన్ అని తేలింది. భార్యను వెంటబెట్టుకొని షాపుకెళ్లాడు. ఆ డిజైన్ అయిపోయిందని, అటువంటిది తయారు చేయాలన్నా ఇంకో మూడునెలల టైమ్ పడుతుందని గోపాల్ సేచెప్పాడు. ఇంకో ఖరీదైన నెక్లెస్ చూపించి, ‘ఇది తీసుకోండి. లేటెస్ట్ డిజైన్. నిన్ననే డీజీపీగారి వైఫ్ వచ్చి నెక్ట్స్ మంత్ ఏదో పార్టీ ఉందని దీనిని తీసుకెళ్లారు’’ అని చెప్పాడు. ఆ మాట వినగానే రమేష్‌కుమార్ భార్య కళ్లు మెరిశాయి. తనకు అది కావాల్సిందేనని ఆమె చూపుతోనే రమేష్‌కుమార్‌కి అర్థమైంది. ధర ఎంతని అడిగితే, ‘జస్ట్ యాభై లక్షలే’ అని చెప్పాడు గోపాల్ సే. ధర వినగానే రమేష్‌కుమార్ గుండె అదిరిపోయింది. ‘‘ఏంటీ యాభై లక్షలే’’ అంటూ నోరెళ్లబెట్టాడు.
‘‘ఔను సర్! ప్యూర్ గోల్డ్. ఫైన్ కటింగ్ డైమండ్స్...’’ అంటూ ఏవేవో చెబుతున్నాడు గోపాల్ సే. కానీ అవేవీ వినకుండా రమేష్ కుమార్ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది కొనివ్వకపోతే భార్య పెట్టే టార్చర్‌ను తట్టుకోలేడు. ఈసారి ఎన్ని నెలలు ఫుడ్డు, బెడ్డు కట్ చేస్తుందోనని అతని భయం. ఆ నెక్లెస్‌ను ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచనలో పడ్డాడు.ఇంతలో గోపాల్ సే, ‘‘ఎస్సైగారు! మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది. డీజీపీగారంటే పెద్దోళ్లు. వాళ్ల లెవలూ, వాళ్ల మెయిన్ ఇన్‌కమ్మూ, సైడ్ ఇన్‌కమ్మూ వేరే. మనమా వాళ్లతో పోటీ పడలేం. కానీ పడాలని కోరిక. సరే, అదంతా పక్కన పెట్టండి. మీరు నాకో సాయం చేస్తే మీకు ఇలాంటివి బోలెడు మీకు సగం రేటుకే అందుతాయి. అలాగే మీకొచ్చే మామూలు మీకు ఎలాగూ అందుతూనే ఉంటుంది. ఇంతకీ మీరు చేయాల్సిందల్లా బయట నుంచి నాకు వేరే దారిలో వచ్చే బంగారాన్ని అడ్డుకోకుండా ఉండటమే.. అంటే మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారు. చెప్పడం నా బాధ్యత. అయినా ఇవన్నీ మీకు తెలియనివి కావులెండి..’’ అంటూ నసుగుతూ అన్నాడు.రమేష్ కుమార్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ‘‘సరే, ఆ నెక్లెస్ ప్యాక్ చేసి ఇంటికి పంపండి’’ అని వెళ్లిపోయాడు. అలా వాళ్ల మధ్య స్నేహం మొదలైంది.ధన్ తెరాస్ కోసం గోపాల్ సే పెద్ద ఎత్తున కొత్త డిజైన్లు చూపిస్తున్నాడు.
అప్పుడే కలకత్తాలో ఉండే అతని బాబాయి కొడుకు శ్యామ్‌లాల్ తను చేసిన కొత్త డిజైన్ల ఫొటోలను వాట్సాప్ చేయమని అడిగాడు. గోపాల్ సేఆ ఫొటోలను అతనికి పంపాడు. వెంటనే శ్యామ్‌లాల్ ఫొటోస్‌లో చిన్న చిన్న డిజైన్స్ సరిగా కనపడటం లేదని, ఒకప్పట్లా పాత పద్ధతిలోనే వాటిని తనకు పంపాలని వాటిని చూసి తను నగలు చేసిన తర్వాత తిరిగి పంపిస్తానని, అవి తిరిగి వచ్చే వరకు అంతే విలువ గల నగలను వాటికి బదులు పంపిస్తానని, బంటీ వాటిని తీసుకుని వచ్చే శుక్రవారం మీ దగ్గరకొస్తాడని వాట్సాప్‌లో మెసేజ్ పంపాడు. దానికి గోపాల్ సే ‘ఓకే’ అంటూ బదులిచ్చాడు.బంటి శ్యామ్‌లాల్ దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడు. శ్యామ్‌లాల్ ఇచ్చిన నగలతో బంటి శుక్రవారం గోపాల్ సేవద్దకొచ్చాడు. బంటి ఇచ్చిన నగలు తీసుకుని, తన కొత్త డిజైన్లను అతనికి ఇచ్చి పంపించాడు గోపాల్ సేవారం గడిచిపోయింది. ధన్ తెరాస్‌కు మరో వారం రోజులే ఉంది. శ్యామ్‌లాల్ నుంచి ఎలాంటి కబురూ రావట్లేదు. గోపాల్ సే శ్యామ్‌లాల్‌కి ఫోన్ చేశాడు.
అటువైపు నుంచి వచ్చిన సమాధానానికి గోపాల్ సేకొయ్యబారిపోయాడు.అసలు తాను డిజైన్ల కోసం ఏ నగలూ అడగలేదని, అయినా బంటి తన దగ్గర పని మానేసి రెండు వారాలు అవుతోందని శ్యామ్‌లాల్ అన్నాడు. పైగా, ‘‘ఏంటి అన్నయ్యా! నా మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నావు. అన్నయ్యా జాగ్రత్త! అక్కడ నువ్వెంతో ఇక్కడ నేనూ అంతే’’ అని ఫోన్ కట్ చేశాడు.గోపాల్ సేకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కలకత్తాకు బయలుదేరాడు. శ్యామ్‌లాల్ షాపులోకి అడుగు పెడుతూనే షాక్ అయ్యాడు. గోపాల్ సే తయారు చేసిన డిజైన్లన్నీ షోకేసుల్లో పెట్టి ఉన్నాయి. ‘‘ఏంటి తమ్ముడూ నన్ను నగలు అడగలేదన్నావు. మరి ఈ డిజైన్లు ఎవరివి?’’‘‘అవి నా డిజైన్లే’’ అని దబాయించాడు శ్యామ్‌లాల్. గోపాల్ సేకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరికీ మాటా మాటా పెరిగి గొడవ పెద్దదయింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి గోపాల్ సేని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత విడుదలై, నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు.జరిగినదంతా చెప్పి ‘‘తమ్మడు ఇలా చేస్తాడనుకోలేదు ఎస్సైగారూ! వీటి విలువ పది కోట్లు. ధన్ తెరాస్ వస్తోంది కదా అని సేల్స్ ఎక్కువవుతాయని అప్పు చేసి మరీ వాటిని తయారు చేయించాను. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. లేకపోతే ఆత్మహత్యే గతి’’ అంటూ భోరుమన్నాడు.
‘‘ఊరుకోండి గోపాల్ సేగారు! చిన్నపిల్లాడిలా ఏడిస్తే ఏం లాభం? ముందు ఈ మంచినీళ్లు తాగండి’’ అంటూ గ్లాస్ అందించాడు. ‘‘అయినా మీ దగ్గర మీ తమ్ముడు ఇచ్చిన అంతే విలువ గల నగలు ఉన్నాయి కదా!’’ అని ఎస్సై అనగానే..‘‘అయ్యో! నా ఖర్మ సార్.. ఖర్మ.. అవి నకిలీవి’’ అంటూ నెత్తికొట్టుకుంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు గోపాల్ సే‘‘అదేంటి తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోలేదా?’’‘‘లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్‌లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది.’’ ‘‘మరి కలకత్తా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా?’’‘‘ఏంటి ఎస్సైగారు! అన్నీ తెలిసిన మీరే ఇలా అడిగితే ఎలా? అది వాడి ఏరియా సర్. నేను కంప్లైంట్ చెయ్యక ముందే నన్ను అరెస్టు చేయించినవాడు. నేను కంప్లైంట్ చేస్తే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్నవాడు. అందుకే నేను డైరెక్ట్‌గా మీ దగ్గరకు వచ్చాను. మీ పోలీసు ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగైనా మీరు వాటిని నాకు దక్కేలా చూడండి.
మీకు వచ్చేది మీకు వచ్చేలా చేస్తాను’’ అని ఎస్సై రమేష్‌కుమార్ చేతులు పట్టుకుని బతిమాలాడు.‘‘సరే గోపాల్ సే గారు! మీరు బాధపడకండి. ప్రాబ్లమ్ నాకు క్లియర్‌గా అర్థమైంది. వాటిని మీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. నాకు ఇవ్వాల్సింది మాత్రం మర్చిపోకండి. మీ ఫోన్ ఇచ్చి వెళ్లండి. అలాగే బంటీ ఫోన్ నంబర్ కూడా’’‘‘అలాగే సర్. మీ మీద నమ్మకంతో ఈ ఒక్కరోజన్నా నేను ప్రశాంతంగా నిద్రపోతాను’’ అని గోపాల్ సేవెళ్లిపోయాడు. గోపాల్ సే ఫోన్ చెక్ చేసి, అతను, అతని తమ్ముడు చేసిన వాట్సాప్ చాట్ చెక్ చేశాడు ఎస్సై రమేష్ కుమార్. అంతా గోపాల్ చెప్పినట్లే ఉంది. క్లూస్ టీమ్‌కి ఆ నంబర్ ఇచ్చి, గోపాల్ సేకి, శ్యామ్‌లాల్‌కి జరిగిన ఫోన్ సంభాషణలను రిట్రీవ్ చేసి విన్నాడు. అంతా గోపాల్ సే చెప్పినట్లే కరెక్ట్‌గా ఉంది. గోపాల్ సే ఇంటి నుంచి నకిలీ నగలను హ్యాండోవర్ చేసుకున్నాడు. కలకత్తాలో తనకు తెలిసిన కానిస్టేబుల్ చేత శ్యామ్‌లాల్ షాపులో ఉండే నగల ఫొటోలు తీయించి, వాటిని గోపాల్ సే వాట్సాప్‌లో పంపిన ఫొటోస్‌తో పోల్చి చూసుకున్నాడు. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. ఇక ఒకే ఒక్క విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అది బంటీగాడి వాంగ్మూలం. శ్యామ్‌లాల్ ఇదంతా చేయించాడని బంటి చెబితే సరిపోతుంది. జాక్‌పాట్ కొట్టినట్టే. పదికోట్ల విలువ చేసే నగలు రికవరీ చేసుకోవచ్చు.
తనకు వచ్చే కమీషన్ కూడా భారీగానే ఉంటుంది అని మనసులో సంతోషించాడు.మర్నాడు డీజీపీకి కేసు వివరించి, ‘‘సర్! బంటీ అరెస్టుకు కావలసిందల్లా కలకత్తా పోలీసుల పర్మిషన్. వాడు అక్కడే ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేశాం. మీరు వాళ్లతో మాట్లాడి పర్మిషన్ తెప్పిస్తే మిగిలినదంతా నేను చూసుకుంటాను’’ అని చెప్పడంతో ‘‘గో అహెడ్’’ అన్నాడు డీజీపీ.మర్నాడే కలకత్తా పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. ఎస్సై రమేష్‌కుమార్ టీమ్ కలకత్తా వెళ్లి బంటీని అరెస్టు చేసి, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇంటరాగేషన్‌లో ఇదంతా శ్యామ్‌లాలే చేయించాడని చెప్పాడు వాడు. రేపు వాణ్ణి కోర్టులో హాజరుపరచి, జడ్జి ఎదుట ఇదే మాట అనిపిస్తే బంటీగాడు జైలుకి, లక్షల కమీషన్ తన జేబులోకి అంటూ కలల్లో తేలిపోసాగాడు రమేష్‌కుమార్. ఇంటికెళ్లి భార్యతో ఇదే విషయం చెబితే ఆమె సంతోషంతో అతణ్ణి వాటేసుకుంది. రాత్రంతా వాళ్లు కలల్లో తేలిపోతూ గడిపారు.తెల్లారుజామున కాస్త కునుకుపడుతుండగా రమేష్‌కుమార్‌కు డీజీపీ నుంచి ఫోన్ వచ్చింది. చిరాగ్గా ఫోన్ ఎత్తి ‘‘చెప్పండి సర్.’’ అన్నాడు.‘‘ఏమైందా..? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా? తొందరగా వెళ్లి ఆ గోపాల్ సేని అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకురా. నేను స్టేషన్‌కు వస్తున్నా’’ అని ఫోన్ కట్ చేశాడు. ఎస్సై రమేష్ కుమార్‌కు నిద్రమత్తంతా వదిలిపోయింది.
హడావుడిగా గోపాల్ సే ఇంటికెళ్లి అతణ్ణి అరెస్టు చేసి, స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. స్టేషన్ కేబిన్‌లో కూర్చుని ఉన్నాడు డీజీపీ. రమేష్ కుమార్ అప్పుడే లోపలకు అడుగు పెట్టాడు. అతణ్ణి చూస్తూనే ‘‘రావయ్యా రా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా’’ అన్నాడు.‘సర్ అసలేం జరిగింది? నాకేమీ అర్థం కావడం లేదు. గోపాల్ సేని ఎందుకు అరెస్టు చేసినట్లు?’’ అన్నాడు.‘‘గోపాల్ సే పెద్ద జాదూగాడయ్యా. ఆ నగలు గోపాల్ సేవి కాదు. శ్యామ్‌లాల్‌వే. శ్యామ్‌లాల్ దగ్గర పనిచేసే బంటీగాడికి డబ్బు ఆశ చూపి తనవైపు తిప్పుకున్నాడు. బంటీగాడు ఆ నగలు సేఫ్ హౌస్‌లో ఉండగానే వాటిని శ్యామ్‌లాల్ ఫోన్ దొంగిలించి, దాంతో ఫొటోలు తీసి గోపాల్‌సేకి పంపించాడు. తర్వాత అవి డిలీట్ చేశాడు. తర్వాత ఆ నంబర్ నుంచి బంటీగాడు శ్యామ్‌లాల్‌లాగ నగలు అడగడం, ఇక్కడ గోపాల్ సే శ్యామ్‌లాల్ నంబర్‌కి ఫోన్‌చేసి పంపడం.. ఇలా వద్దని బంటీ చేత తనకు నగలు పంపించాలని బంటీగాడే శ్యామ్‌లాల్‌లా మెసేజ్‌లు పంపడం .. తర్వాత బంటీ శ్యామ్‌లాల్ దగ్గర పని మానేయడం.. ఇదంతా వాళ్ల ప్లాన్‌లో భాగమే.. ఇక్కడ నీతో పరిచయం కూడా వాడి మాస్టర్ ప్లాన్‌లో భాగమే.
వాడి తర్వాతి స్టెప్‌ను నువ్వు కంప్లీట్ చేశావు. బంటీగాడి ఫోన్ ఆన్‌లో ఉంచుకోమని చెప్పి, దాని ద్వారా నువ్వు అతన్ని పట్టుకున్నప్పుడు శ్యామ్‌లాలే ఇదంతా చేయించాడని చెప్పడం కూడా అతని ప్లాన్‌లో భాగమే. వాడు జైలుకెళ్తే తర్వాత వాణ్ణి బెయిల్‌పై బయటకు తెచ్చే బాధ్యత తనదేనని గోపాల్ సేవాడికి ముందుగానే మాట ఇచ్చాడు.’’ఇదంతా విన్న ఎస్సై రమేష్ నిర్ఘాంతపోయాడు. తన పక్కనే ఉంటూ తనకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశాడా.. అనుకున్నాడు.ఇక కేసు ఎలా ఛేదించాడో డీజీపీ చెప్పసాగాడు. ‘‘ఇక్కడ గోపాల్‌సేకి నువ్వెలా దోస్తువో, అక్కడ శ్యామ్‌లాల్‌కి కూడా పోలీసుల్లో ఒక దోస్తు ఉన్నాడు.
మనం బంటీ అరెస్టుకు పర్మిషన్ అడిగినప్పుడు అక్కడి పోలీసులు శ్యామ్‌లాల్ ఫోన్ హ్యాండోవర్ చేసుకుని, ఫోరెన్సిక్ టీమ్‌తో క్రాస్ చెక్ చేయించారు. బంటీగాడు శ్యామ్‌లాల్ ఫోన్ నుంచి గోపాల్‌సే కి పంపి, డిలీట్ చేసిన ఫొటోలను కూడా రిట్రీవ్ చేశాడు. అవి బయటపడటంతో గోపాల్ సే, బంటీ కుమ్మక్కై వేసిన మాస్టర్‌ప్లానేనని అర్థం చేసుకున్నాడు. శ్యామ్‌లాల్ కలకత్తా కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మీద అక్కడి పోలీసులు ఇక్కడకు వచ్చారు. సెల్‌లో ఉన్న బంటీగాడిని కలకత్తా స్టైల్‌లో ఇంటరాగేట్ చేయడంతో నిజం కక్కాడు’’ అని వివరించాడు. ‘‘వాళ్లు ముందే వచ్చారు కాబట్టి సరిపోయింది. మనం బంటీగాడిని జడ్జి ముందు పెట్టి, శిక్షపడేలా చేశాక వచ్చి ఉంటే మన ఉద్యోగాలకే ఎసరొచ్చేది’’ అంటూ ఎస్సై రమేష్‌కుమార్‌కి చీవాట్లు పెట్టాడు.
ఎం.శంకర్ రామమూర్తి
Comments
Please login to add a commentAdd a comment