కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న నల్లగొండ వాసి ఆవేదన
25 ఏళ్లుగా మంచానికేపరిమితమై నరకయాతన
నల్లగొండ టౌన్: ‘కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాను. ప్రభుత్వం చేయూతనిచ్చి నన్ను ఆదుకోవాలి.. లేదా డెత్ ఇంజక్షన్‌కు అనుమతిచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలి’అని నల్లగొండ పట్టణానికి చెందిన బాధితుడు జంపాల గోపాల్ వేడుకుంటున్నారు.
బాధితుడు గోపాల్‌తో పాటు అతని తల్లి అంజమ్మ తెలిపిన వివరాలు.. నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు పరిధి సాగర్ రోడ్డు మారుతీనగర్‌కు చెందిన 44 ఏళ్ల గోపాల్ 25 సంవత్సరాలుగా మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్నారు. గోపాల్ ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఆర్టీసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం రావడంతో ఫిజికల్ టెస్టులో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు అతనికి మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయన ఆర్టీసీలో ఉద్యోగం కోల్పోయాడు. తరువాత ఆరు నెలల కాలంలోనే వ్యాధి తీవ్రమై కండరాలు క్షీణించి జీవచ్ఛవంలా మారారు. కదలలేక, నడవలేక, కాళ్లు, చేతులు పనిచేయక మాటకే పరిమితమయ్యారు. 25 సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
అన్నీ తానైన కన్నతల్లి..
జీవచ్ఛవంలా మారి నడి వయసుకు వచ్చిన కుమారుడికి 70 ఏళ్ల వృద్ధురాలైన తల్లి అంజమ్మ ఒక్కతే దిక్కు. తల్లికి కుమారుడు చేదోడువాదోడుగా ఉండాల్సిన వయసులో తల్లే తన కుమారుడికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది.
ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి..
కేవలం ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ 4 వేల రూపాయలే తమకు ఆధారమని ఆస్తిపాస్తులు లేని తమకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని, లేదంటే తనకు డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు. అదే విధంగా తాను మరణిస్తే తన భౌతిక కాయాన్ని మసు్క్యలర్ డిస్ట్రోపీ వ్యాధి నయం చేసే మందును కనుగొనేందుకు పరిశోధనకు ఉపయోగించాలని కోరుతున్నారు. దాతలు ముందుకొచ్చి ఫోన్ నంబర్ 9182241141 (గూగుల్‌పే, ఫోన్‌పే)కు ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment