సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన అబ్బాయికి, చెన్నై అమ్మాయితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 15 రోజులకే ఇద్దరూ వేరయ్యారు. తన భర్త నపుంసకుడంటూ విడాకులు కోరుతూ ఆమె కోర్టుకు ఎక్కింది. విడాకులు మంజూరు కాకుండా ఉండటానికి తాను మగాడినేనని నిరూపించుకోవాలని అతడు భావించాడు. అందుకు నేర మార్గాన్ని అనుస రించడంతో కటకటాల్లోకి చేరాడు. చెన్నైలోని మహిళా ఠాణా నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది.
సమ్మతి లేకుండానే వివాహం...
ఎల్బీనగర్‌కు చెందిన వాసు కుటుంబానికి, చెన్నైలోని ముథామిజ్‌నగర్‌కు చెందిన ఓ యువతి కుటుంబాని కి మధ్య పరిచయం ఉంది. దీంతో వీరిద్దరికీ వివా హం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. వాసు, యువతి మధ్య సరైన అవగాహన, పరస్పరం అర్థం చేసుకునే తత్వాలు లేవు. ఇదేమీ పట్టించుకోని పెద్దలు వారి సమ్మతి లేకుండానే 2016లో పెళ్లి చేశారు. ఎల్బీనగర్‌కు కాపురానికి వచ్చిన వాసు భార్య 15 రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాలు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తన భర్త నపుంసకుడని ఆరోపించిన ఆ యువతి విడాకులు కోరుతూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే ఆ ఆరోపణలు తప్పని, వేరే కారణాల నేపథ్యంలోనే తన భార్య విడాకులు కోరుతోందంటూ వాసు తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలకు స్పష్టం చేస్తూ వస్తున్నాడు.
విసిగిపోయి‘వీడియో’ పంపించాడు...
తాను చెప్తున్న విషయాన్ని తన తల్లిదండ్రు లు నమ్ముతున్నా... అత్తమామలు నమ్మట్లేదని వా సు భావించాడు. ఓ పక్క చెన్నై కోర్టులో విడాకుల కేసు విచారణ తుది దశకు చేరడంతో పాటు విడాకులు మంజూరైతే తన భార్య చెప్పిందే నిజమని నమ్ముతారని అనుకున్నాడు. దీంతో అత్తమామలకు తాను నపుంసకుడిని కాదని స్పష్టం చేయా లని నిశ్చయించుకున్నాడు. ఇది ఎలా చేయాలా అని ఆలోచించిన వాసుకు ఓ చిల్లర ఆలోచన వచ్చింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఓ వ్యభిచారిణిని సంప్రదించాడు. ఆమెతో కలసి శృంగారంలో పాల్గొంటూ 5 నిమిషాల నిడివితో వీడియో తీయించాడు. దీన్ని వాట్సాప్ ద్వారా చెన్నైలోని అత్తమామలకు షేర్ చేశాడు. వీడియో చూసి షాక్‌కు గురై.. వారు విషయాన్ని అక్కడి ఎంకేబీ నగర్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఆరోపణలపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ డి.చిత్ర ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపారు. ఈ టీమ్ వాసును అరెస్టు చేసి తీసుకువెళ్లి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. వీడియోను పరిశీలించగా, మరో వ్యక్తి చిత్రీకరించినట్లు ఉందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అది ఎవరో గుర్తించడం కోసం వాసును కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment