నేను ఉగ్రవాదిని కాను | I am not a terrorist | Sakshi
Sakshi News home page

నేను ఉగ్రవాదిని కాను

Published Fri, Feb 26 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

గురువారం జైలు నుంచి బయటకు వస్తున్న సంజయ్. (ఇన్‌సెట్‌లో) జైలువద్ద నేలకు నమస్కరిస్తూ..

గురువారం జైలు నుంచి బయటకు వస్తున్న సంజయ్. (ఇన్‌సెట్‌లో) జైలువద్ద నేలకు నమస్కరిస్తూ..

ముంబై పేలుళ్ల కేసుతో ముడిపెట్టకండి: సంజయ్ దత్
♦ 23 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎరవాడ జైలునుంచి విడుదల
♦ పూర్తి స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్య
 
 సాక్షి, పుణే/ ముంబై: ‘నేను ఉగ్రవాదిని కాను. నన్ను ముంబై బాంబు పేలుళ్ల ఘటనతో ముడిపెట్టకండి. అక్రమంగా ఆయుధాలున్నందుకే జైలుశిక్ష అనుభవించాను’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలిపారు. ముంబైలో బాంబు పేలుళ్ల కేసులో శిక్షాకాలం పూర్తి చేసుకున్న సంజయ్ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 56 ఏళ్ల సంజయ్ చిరునవ్వుతో బయటకొచ్చి జైలుపైన ఎగురుతున్న జాతీయ జెండాకు శాల్యూట్ చేసి, తర్వాత భూమిని ముద్దాడారు. తర్వాత భార్య మాన్యత, నిర్మాత-స్నేహితుడు రాజ్‌కుమార్ హిరాణీలతో కలసి పుణే విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు.

 వెల్‌కమ్ సంజూ బాబా!
 ముంబై ఎయిర్‌పోర్టు నుంచి సిద్ధివినాయకుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తర్వాత తన తల్లి నర్గీస్ సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత బాంద్రాలోని నివాసానికి చేరుకున్న సంజయ్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. మహేశ్ భట్, సుభాష్ ఘాయ్, జుహీ చావ్లా, గ్రేసీ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంజయ్‌కు అభినందనలు తెలిపారు.

 రాత్రంతా నిద్రలేదు: 23 ఏళ్ల నుంచి చేస్తున్న నిరీక్షణ తర్వాత ఇప్పడు పూర్తి స్వాతంత్య్రం లభించిందని సంజయ్ వ్యాఖ్యానించారు. కుట్ర కేసులో టాడా కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తు చేశారు. తనకు దేశమంటే గౌరవం ఉన్నందు నే సుప్రీం తీర్పును శిరసావహించానన్నారు. జైలులో పనిచేసినందుకుగాను లభించిన రూ. 440లను భార్యకు ఇచ్చానన్నారు. విడుదలవుతున్న ఆనందంతో రాత్రంతా నిద్రపోలేదని.. మూడునాలుగు రోజులుగా భోజనం చేయలేదని ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు ఎంతో ఉద్వేగభరితమైందని సంజ య్ సోదరి ప్రియాదత్ అన్నారు.

 అంతా నిబంధనల ప్రకారమే..
 దత్‌కు వీఐపీ మర్యాదలు చేసి ముందుగానే విడుదల చేశారంటూ జైలు వద్ద పలువురు నిరసనకారులు ఆందోళనకు దిగారు. సంజ య్‌కు పెరోల్, 144 రోజుల రెమిషన్ అన్నీ.. జైలు నిబంధనల ప్రకారమే జరిగాయని జైలు అధికారులు, దత్ లాయర్లు స్పష్టంచేశారు. కాగా, రెమిషన్‌పై దత్‌ను  విడుదల చేయడా న్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణను ముంబైహైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement