సెంట్రల్ జైలుకు సంజయ్ దత్ సెల్యూట్
పుణే: భుజానికి బ్యాగు, చేతిలో ఫైలుతో 'మున్నాభాయ్' ఎరవాడ కేంద్రీయ కారాగారం నుంచి బయటకు వచ్చాడు. జైలు బయటకు వచ్చిన వెంటనే 'ఖల్ నాయక్' కారాగారానికి సెల్యూట్ చేశాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం ఉదయం ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు.
ముదురు నీలం రంగు చొక్కా, నలుపు రంగు జీన్స్ ధరించి నుదుటున పెద్ద బొట్టుకుని భుజానికి బరువైన బ్యాగు, చేతితో ఫైలు పట్టుకుని దత్ బయటకు వచ్చాడు. బయటకు రాగానే చేతిలోని బ్యాగ్ ను కిందపెట్టి జైలు వైపు తిరిగి సెల్యూట్ చేశాడు. ఈ వీడియోను మీడియా చానళ్లు పదేపదే ప్రసారం చేశాయి. అభిమానులకు అభివాదం చేసిన వెంటనే కారులో పుణే ఎయిర్ పోర్టులో చేరుకున్నాడు.
సంజయ్ దత్ భార్య మాన్యత, బంధువులు ఎయిర్ పోర్టులో ఆయనను కలుసుకున్నారు. జైలు నుంచి విముక్తి కావడానికి చాలా కష్టపడ్డానని సన్నిహితులతో సంజయ్ చెప్పాడు. అభిమానుల ప్రేమాభిమానాల కారణంగానే తొందరగా విడుదలయ్యానని చెప్పాడు.