Sanjay Dutt released
-
నేను ఉగ్రవాదిని కాను
ముంబై పేలుళ్ల కేసుతో ముడిపెట్టకండి: సంజయ్ దత్ ♦ 23 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎరవాడ జైలునుంచి విడుదల ♦ పూర్తి స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్య సాక్షి, పుణే/ ముంబై: ‘నేను ఉగ్రవాదిని కాను. నన్ను ముంబై బాంబు పేలుళ్ల ఘటనతో ముడిపెట్టకండి. అక్రమంగా ఆయుధాలున్నందుకే జైలుశిక్ష అనుభవించాను’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలిపారు. ముంబైలో బాంబు పేలుళ్ల కేసులో శిక్షాకాలం పూర్తి చేసుకున్న సంజయ్ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 56 ఏళ్ల సంజయ్ చిరునవ్వుతో బయటకొచ్చి జైలుపైన ఎగురుతున్న జాతీయ జెండాకు శాల్యూట్ చేసి, తర్వాత భూమిని ముద్దాడారు. తర్వాత భార్య మాన్యత, నిర్మాత-స్నేహితుడు రాజ్‌కుమార్ హిరాణీలతో కలసి పుణే విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు. వెల్కమ్ సంజూ బాబా! ముంబై ఎయిర్‌పోర్టు నుంచి సిద్ధివినాయకుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తర్వాత తన తల్లి నర్గీస్ సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత బాంద్రాలోని నివాసానికి చేరుకున్న సంజయ్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. మహేశ్ భట్, సుభాష్ ఘాయ్, జుహీ చావ్లా, గ్రేసీ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంజయ్‌కు అభినందనలు తెలిపారు. రాత్రంతా నిద్రలేదు: 23 ఏళ్ల నుంచి చేస్తున్న నిరీక్షణ తర్వాత ఇప్పడు పూర్తి స్వాతంత్య్రం లభించిందని సంజయ్ వ్యాఖ్యానించారు. కుట్ర కేసులో టాడా కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తు చేశారు. తనకు దేశమంటే గౌరవం ఉన్నందు నే సుప్రీం తీర్పును శిరసావహించానన్నారు. జైలులో పనిచేసినందుకుగాను లభించిన రూ. 440లను భార్యకు ఇచ్చానన్నారు. విడుదలవుతున్న ఆనందంతో రాత్రంతా నిద్రపోలేదని.. మూడునాలుగు రోజులుగా భోజనం చేయలేదని ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు ఎంతో ఉద్వేగభరితమైందని సంజ య్ సోదరి ప్రియాదత్ అన్నారు. అంతా నిబంధనల ప్రకారమే.. దత్‌కు వీఐపీ మర్యాదలు చేసి ముందుగానే విడుదల చేశారంటూ జైలు వద్ద పలువురు నిరసనకారులు ఆందోళనకు దిగారు. సంజ య్కు పెరోల్, 144 రోజుల రెమిషన్ అన్నీ.. జైలు నిబంధనల ప్రకారమే జరిగాయని జైలు అధికారులు, దత్ లాయర్లు స్పష్టంచేశారు. కాగా, రెమిషన్‌పై దత్‌ను విడుదల చేయడా న్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణను ముంబైహైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. -
నిన్న రాత్రి తినలేదు.. నిద్రపోలేదు!
జైలు నుంచి బయటకు వస్తున్నానన్న ఆనందం.. ఇక మళ్లీ లోపలకు రావల్సిన అవసరం లేదన్న భావనతో చాలా ఉద్వేగంగా అనిపించిందని, అందుకే బుధవారం రాత్రి అంతా తాను తిండి సరిగా తినలేదు.. నిద్ర కూడా పోలేదని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలిపారు. పుణె ఎరవాడ జైలు నుంచి విడుదలై, ముంబైలో సొంత ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన కిక్కిరిసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లకు తనకు స్వాతంత్ర్యం లభించిందని, కానీ ఇప్పుడు కూడా ఆ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా ఏదో పెరోల్ మీద బయటకు వచ్చినట్లే అనిపిస్తోందన్నారు. ఈ సమయంలో తనకు తన తండ్రి బాగా గుర్తుకొస్తున్నారని, ఆయన ఉంటే చాలా సంతోషించేవాళ్లని తెలిపారు. ''నాన్నా.. నేను బయటకు వచ్చేశాను'' అని పైకి చూస్తూ చెప్పారు. తాను ఈ దేశ పౌరుడినని, భారతీయుడైనందుకు గర్వపడుతున్నానని సంజయ్ దత్ చెప్పారు. అలాగే శిక్ష విధించే సమయంలో కూడా.. తాను టెర్రరిస్టును కానని కోర్టు చెప్పిందని, ఆరోజు చాలా సంతోషంగా అనిపించిందని, ఆ విషయం తన తండ్రి సునీల్‌దత్‌కు తెలిస్తే ఇంకా బాగుండేదని అన్నారు. తన చిన్నతనంలోనే అమ్మ కేన్సర్‌తో చనిపోయిందని, ఆమె సమాధి వద్దకు వెళ్లి తాను స్వేచ్ఛాజీవినని చెప్పడం తన విధి అని తెలిపారు. సెలబ్రిటీని కాబట్టి పెరోల్ వచ్చిందనో, ముందుగా విడుదల చేశారనో అనుకోవడం తప్పని, తన ప్రవర్తనను బట్టి వాళ్లు నిర్ణయం తీసుకుని ఉంటారని అన్నారు. మాన్యత తన బెటర్ హాఫ్ కాదు.. బెస్ట్ హాఫ్ అని వ్యాఖ్యానించారు. ఓ మంచి భర్తగా తాను జైల్లో సంపాదించిన మొత్తం తన భార్యకే ఇచ్చానని తెలిపారు. అనంతరం తన భార్య, కొడుకు, కూతుళ్లతో కలిసి మీడియాకు ఫొటో పోజులు ఇచ్చారు. పిల్లలిద్దరూ తండ్రిని అతుక్కుపోయి కనిపించారు. -
సెంట్రల్ జైలుకు సంజయ్ దత్ సెల్యూట్
పుణే: భుజానికి బ్యాగు, చేతిలో ఫైలుతో 'మున్నాభాయ్' ఎరవాడ కేంద్రీయ కారాగారం నుంచి బయటకు వచ్చాడు. జైలు బయటకు వచ్చిన వెంటనే 'ఖల్ నాయక్' కారాగారానికి సెల్యూట్ చేశాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం ఉదయం ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ముదురు నీలం రంగు చొక్కా, నలుపు రంగు జీన్స్ ధరించి నుదుటున పెద్ద బొట్టుకుని భుజానికి బరువైన బ్యాగు, చేతితో ఫైలు పట్టుకుని దత్ బయటకు వచ్చాడు. బయటకు రాగానే చేతిలోని బ్యాగ్ ను కిందపెట్టి జైలు వైపు తిరిగి సెల్యూట్ చేశాడు. ఈ వీడియోను మీడియా చానళ్లు పదేపదే ప్రసారం చేశాయి. అభిమానులకు అభివాదం చేసిన వెంటనే కారులో పుణే ఎయిర్ పోర్టులో చేరుకున్నాడు. సంజయ్ దత్ భార్య మాన్యత, బంధువులు ఎయిర్ పోర్టులో ఆయనను కలుసుకున్నారు. జైలు నుంచి విముక్తి కావడానికి చాలా కష్టపడ్డానని సన్నిహితులతో సంజయ్ చెప్పాడు. అభిమానుల ప్రేమాభిమానాల కారణంగానే తొందరగా విడుదలయ్యానని చెప్పాడు.