న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అట్టుడుకుతోంది. ఆదివారం యూనివర్సిటీలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. సీఏఏపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసించడంతో.. అక్కడ అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీ ఝళిపించారు. ఇక ఈ ఘటనతో మహిళా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. దేశ రాజధానిలో ఉన్న జామియా యూనివర్సిటీ అత్యంత సురక్షితంగా భావించి ఇక్కడ చేరామని.. కానీ నిన్న రాత్రంతా తమకు నరకం కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన విద్య, రక్షణ లభిస్తుందని ఇక్కడికి వచ్చానని జార్ఖండ్‌కు చెందిన ఓ విద్యార్థిని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
‘దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను చూస్తుంటే.. మన దేశమే సురక్షితం కాదేమేనని అనిపిస్తుంది. హాస్టళ్లు వదిలి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్లాలో.. అర్థం కావడం లేదు. ఎవరి చేతిలో దాడికి గురౌతానో తెలియద’ని ఆమె వాపోయారు. ‘నా స్నేహితులు రేపు భారతీయులుగా ఉంటారో లేదో తెలియయడం లేదు. నేను ముస్లిం కాదు. అయినా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. సత్యం వైపునకు నిలబడని చదువులు ఎందుకు’ అని ప్రశ్నించారు. కాగా, విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులు దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని.. విడిచిపెట్టారు. ఘర్షణలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు.
(చదవండి : చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!)
Comments
Please login to add a commentAdd a comment