
ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ఆవిర్భావం
రాజకీయ ఫోరాన్ని ప్రారంభించిన దీప
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మేనకోడలు దీప ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ అనే రాజకీయ ఫోరంను శుక్రవారం ప్రకటించారు. జయలలిత, ఎంజీఆర్ చిత్రాలతో కూడిన పేరవై పతాకాన్ని ఆవిష్కరించి.. తీర్మానాలను వివరించారు. ఇది రాజకీయ పార్టీ కాదు సంఘం మాత్రమేనన్నారు. అన్నాడీఎంకే చిహ్నమైన రెండు ఆకుల గుర్తును తిరిగి స్వాధీనం చేసుకొని.. అమ్మ పాలన అందించడమే లక్ష్యమని ప్రకటించారు. మీడియానుద్దేశించి దీప మాట్లాడుతూ.. శశికళ దుష్ట శక్తి అని అభివర్ణించారు. ఆర్కే నగర్ నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఘనంగా అమ్మ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయంతి వేడుకలు శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తమిళనాడు ప్రభుత్వం, అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు, తిరుగుబాటు నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఆధ్వర్యంలో వాడవాడలా పలుసేవా కార్యక్రమాలు నిర్వహించారు. ‘‘పార్టీని కాపాడండి.. ప్రజల కోసం పనిచేయండి’’అని బెంగళూరు జైలులో ఉన్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళ ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులను కోరారు.
శశికళ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శపథం చేశారు. ఆర్కేనగర్‌లో ఆమె 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ శుక్రవారం భేటీ అయ్యారు. తమిళనాట రాజకీయ పరిస్థితులపై చర్చించారు.