నేను పట్టభద్రురాలినే!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తీవ్ర వివాదానికి దారితీసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్టు ఆమె తెలిపారు. శనివారమిక్కడ ‘ఇండియాటుడే మహిళా సదస్సు-2014’లో ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను పట్టభద్రురాలినే. ప్రతిష్టాత్మక యేల్ వర్సిటీ డిగ్రీ చదివాను’ అని చెప్పారు. అయితే, డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివారో మాత్రం చెప్పలేదు. గత ఏడాది జూన్ 19న యేల్ వర్సిటీ క్యాంపస్‌లో ఆరు రోజుల పాటు జరిగిన లీడర్‌షిప్ కార్యక్రమంలో ఇరానీ సహా 11 మంది ఎంపీలు పాల్గొన్నారు.
వీరిలో టీడీపీకి చెందిన ఎంపీ సి. రమేష్ ఉన్నారు. కాగా, ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ వివాదంపై అడిగిన ప్రశ్నపై మంత్రి ఇరానీ మండిపడ్డారు. ‘2004, 2014నాటి అఫిడవిట్లలో ఏది నిజమైందో తెలుసుకోవాలంటే కోర్టులో నాపై పిటిషన్ వెయ్యి. సమాధానం కోర్టులోనే చెబుతా’ అని ఇండియాటుడే కార్యక్రమ నిర్వాహకుడితో అన్నారు.