
‘మాకు 300స్థానాలు పక్కా’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారం చేపట్టడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 300పైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కలయిక ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పెద్ద మార్పును తీసుకొస్తుందని అది ప్రతి ఒక్కరూ చూస్తారని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా చెప్తున్నానని, తమకు ఈ ఎన్నికల్లో 300 సీట్లు దాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడుతూ ‘ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒప్పందం కాదు. ఇది ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఒప్పందం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మార్పు తీసుకురాగల యువకులది ఈ ఒప్పందం’ అని చెప్పారు. రెండు అవినీతి కుటుంబాల మధ్య యూపీలో పొత్తు జరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అఖిలేశ్ ఇలా బదులిచ్చారు.