
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న అఖిలేశ్ యాదవ్ కాస్త చిరాకుతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులు అనేవి సమయం వృధా చేసే పనులు అని, సీట్ల పంపిణీ విషయంలో పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెడతాయని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై బుధవారం అఖిలేశ్ స్పందిస్తూ తన గురి మొత్తం ఇప్పుడు ఆ ఎన్నికలపైనే అన్నారు. 2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం సమాజ్‌వాది పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. '2019 ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి దేశం మొత్తానికి ఓ సందేశం వెళ్లనుంది. ఇప్పుడు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే విషయాన్ని నేను ఆలోచించడం లేదు. అదంతా కూడా సమయం వృధా. ఇక నేను తికమక అవ్వాలని అనుకోవడం లేదు. అయితే, పొత్తులు గురించి కాకుండా మాలాగే ఆలోచించే పార్టీతో స్నేహం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాము' అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ పొత్తుపెట్టుకొని పనిచేసి ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే.