నన్నూ చంపేస్తారేమో! : రాహుల్ గాంధీ
చురు/అల్వార్: బీజేపీ తన ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషాలను సృష్టిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను ఎగదోస్తోందని, దేశ ప్రజలను విడదీసి, దేశ సమగ్రతను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. అలాంటి విద్వేష రాజకీయాల కారణంగా తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీల్లా తానూ హత్యకు గురికావొచ్చని, కానీ తాను భయపడబోనని, దానిని పట్టించుకోనని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని చురు, అల్వార్‌ల్లో బుధవారం రాహుల్ ఎన్నికల ప్రచార సభల్లో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశం కోసం తమ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని పరోక్షంగా పేర్కొంటూ.. ఓటర్ల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఇటీవలి మతకల్లోలం అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘అక్కడ మంట పెట్టింది బీజేపీ వాళ్లే. గుజరాత్‌లో, యూపీలో, కాశ్మీర్‌లో విద్వేషాలను రెచ్చగొట్టిందీ వాళ్లే. వారి రాజకీయాలు ఆగ్రహానికి, అస్థిరతకు, హింసకు దారితీసి విలువైన ప్రాణాలను బలిగొంటున్నాయి. మా నానమ్మ హత్యకు గురైంది.
మా నాన్నను చంపేశారు. ఒక రోజు నన్నూ హత్య చేయొచ్చు. కానీ, నేను భయపడను’ అని పేర్కొన్నారు. తన నానమ్మను హత్య చేసిన సత్వంత్ సింగ్, బీంత్‌సింగ్‌లపై విపరీతమైన కోపం వచ్చిందని, ఆ కోపం తగ్గడానికి పదేళ్లకుపైగా పట్టిందని చెప్పారు. ‘‘ఒక రోజు పంజాబ్ ఎమ్మెల్యే ఒకరు నాతో మాట్లాడి వెళ్లిపోతూ.. ఒక ఇరవై ఏళ్ల కిందగానీ కలిసి ఉంటే తను నన్ను చంపేసేవాడినని చెప్పాడు. కానీ, ఇప్పుడు కోపం తగ్గిపోయిందన్నాడు. ఎవరికైనా కోపం వస్తుంది. అయితే, దానిని కల్పించేది మాత్రం రాజకీయ నాయకులే’ అని చెప్పారు. కాగా,ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందని, అలా భవిష్యత్తులో ప్రతీ ఒక్కరి జేబులో రాజకీయాధికారం ఉండేలా చేయాలని ఉందని వ్యాఖ్యానించారు. 2014 తర్వాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. కాగా, డిస్కస్ త్రో క్రీడాకారిణి కృష్ణ పునియా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రచారమా?: బీజేపీ
పాట్నా: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ భావోద్వేగ అంశాలను ప్రస్తావించి పార్టీకి ఓటు వేయాలని కోరారని బీజేపీ మండిపడింది. యూపీఏ ప్రభుత్వ పనితీరు గురించి చెప్పుకుకోడానికి ఏమీ లేకనే రాహుల్... ఇందిర, రాజీవ్‌ల హత్యలను ఏకరువు పెట్టారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.