'జయగారు మీరు ఆయన్ను ఫాలో అవ్వండి'
చెన్నై: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేతలు శుక్రవారం ముఖ్యమంత్రి జయలలితపై విరుచుకుపడ్డారు. మద్యం నిషేధం విషయంలో ఆమె బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను చూసి నేర్చుకోవాలని, ఆయన అడుగు జాడల్లో నడవాలని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి మద్యం నిషేధిస్తానని తీసుకున్న నితీశ్ నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నది, మానవీయ విలువలకు దర్పణం అన్నారు. తమిళనాడులో ఎంతోమంది మద్యానికి బానిసలై తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఎప్పటి నుంచో చెబుతున్నా, మద్యం పై నిషేధం విధించాలని కోరినా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని ఇప్పటికైన అప్రమత్తమై ఆ దిశగా చర్యలు చేపట్టాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు.
ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమంటే నిజంగా అదేనని మరోసారి బిహార్ సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. 'నితీశ్ను ఫాలో అవ్వమని నేను జయలలితను కోరుతున్నాను. ఈ విషయంలో వాదనలు ఆపేయాలి. వెంటనే చట్టాన్ని తీసుకురావాలి. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ గా చూడకుండా ప్రజల డిమాండ్ గా పరిగణించాలి' అని స్టాలిన్ కోరారు.