
గువాహటి : ప్రాణాలు పోయినా సరే పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అనుమతించేది లేదని అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ద్వారా అస్సాం ప్రజలకు కలుగుతున్న బాధ కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్‌మరిలో అస్సాం ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆదివారం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జుబీన్.. ‘చచ్చినా సరే అస్సాంలో సీఏఏని అనుమతించను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధను అర్థం చేసుకోవాలి. కానీ, నిరసన గళం వినిపించిన అమాయక పిల్లల్ని చంపుతున్నారు’అని పేర్కొన్నాడు.
(చదవండి : 5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు)
సీఏఏపై అస్సాం ఆర్టిస్ట్ అసోషియేషన్ సుప్రీంకు వెళ్లనుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. కాగా, ఈ నిరసన కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన వేల మంది కళాకారులు పాల్గొన్నారు. శాంతి సమ్మేళనం పాటల కచేరిని నిర్వహించారు. ఆల్ ఆస్సాం విద్యార్థి యూనియన్ (ఏఏఎస్‌యూ) ఈ నిరసనకు మద్దతు పలికింది. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ యూటర్న్ తీసుకున్నారని ఏఏఎస్‌యూ నాయకులు మండిపడ్డారు. ఏఏఎస్‌యూలో ఉన్నప్పుడు అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. కాగా, జుబీన్ బాలీవుడ్‌లో కూడా పలు విజయవంతమైన పాటలు పాడారు.
(చదవండి : ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!)
Comments
Please login to add a commentAdd a comment