సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తా: జయలలిత
తమిళ ప్రజల అభిమానమే నా బలం: జయలలిత
జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా ప్రకటన
సాక్షి, చెన్నై: తాను జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని.. ప్రస్తుత సవాలును కూడా తమిళ ప్రజల అభిమానంతో విజయవంతంగా అధిగమిస్తానని తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేర్కొన్నారు. ఆమె తన ప్రజా జీవితాన్ని భయంకరమైన సముద్రాన్ని ఈదడంగా పోల్చారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తొలిసారిగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. తమిళ ప్రజల ప్రేమ, అభిమానంతో వాటిని విజయవంతంగా అధిగమించాను.
నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీ సోదరిగా ప్రజా సంక్షేమం కోసం పనిచేశాను. తమిళనాడు ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తల క్షేమం, అభివృద్ధే నా లక్ష్యం..’’ అని ఆమె పేర్కొన్నారు. తనకు వచ్చిన ఈ పరిస్థితిని తట్టుకోలేక 139 మంది గుండె ఆగి చనిపోయారని, 54 మంది బలిదానం చేసుకున్నారని.. వారి మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నానని జయలలిత పేర్కొన్నారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. మూడేసి లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాగా.. జయలలితకు బెయిల్ అంశంలో స్పందించేందుకు ఆమె రాజకీయ ప్రత్యర్థి డీఎంకే చీఫ్ కరుణానిధి నిరాకరించారు. ఆమెకు జైలు శిక్ష పడ్డప్పుడు ఆనందపడలేదని, బెయిల్ వచ్చినప్పుడు చింతించనూ లేదని పేర్కొన్నారు.
రజనీకాంత్, మేనకాగాంధీ హర్షం
జైలు నుంచి జయలలిత విడుదలై ఇంటికి చేరడం పట్ల సూపర్‌స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రి మేనకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు వారు వేర్వేరుగా రాసిన లేఖలను అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి.