షోలాపూర్, న్యూస్‌లైన్: భారతదేశంలో మైనారిటీలకు సముచితస్థానం కోసం తాము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (ఎంఐఎం) నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదని, లౌకిక దేశమైన భారత్‌లో అన్ని మతాలవారికి సమాన హక్కు ఉండాలనేది తమ సిద్ధాంతమని ఆయనన్నారు.
ఆయన సోమవారం రాత్రి స్థానిక హోం మైదానంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బాబ్రీ మసీద్ నేలమట్టమవడానికి ముందు భారతీయ జనతాపార్టీకి దేశం మొత్తం మీద ఇద్దరే ఎంపీలు ఉన్నారని, కాని మసీదు కూల్చివేత తర్వాత హిందుత్వవాదులుగా ప్రచారం చేసుకుని 280 ఎంపీ సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆయన ఆరోపించారు.
ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందు పరిషత్, భజరంగ్‌దళ్ వంటి మతసంస్థలతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే గోద్రా ఘర్షణలు జరిగిన విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. షోలాపూర్‌కే చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మతహింసను నిరోధించే బిల్లును పార్లమెంట్‌లో ఎందుకు ఆమోదింపజేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.
తాము హిందువులకు వ్యతిరేకంగా కాదన్నారు. అయితే హిందూత్వాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇతర మతాలపై దాడులు జరిపే ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ వంటి మతసంస్థలకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ దేశంలో ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందనే విషయాన్ని నేతలు గుర్తించాలన్నారు.
దేశంలోని 85 శాతం మేర మైనార్టీలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవనం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నాయి తప్ప వారి ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఏమాత్రం కృషిచేయలేదని ఆయన ఆరోపించారు.
పట్టణంలో మూడు లక్షల మంది వరకు మైనార్టీలున్నారు. వీరు టీ, గుట్కా తదితర వ్యసనాలపై ఖర్చు చేసే డబ్బులో రోజుకు ఒక్క రూపాయి చొప్పున మసీద్ కోసం జమ చేసినట్లైతే ఒక రోజుకు రూ. మూడు లక్షలు, అలాగే ఏడాదికి సుమారు రూ.11 కోట్లు ఆదా చేయవచ్చని, ఆ సొమ్ముతో ఇతరుల ముందు చేయి చాపాల్సిన అవసరం రాదని కూడా ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మైనార్టీలకు హితవు పలికారు.
మైనారిటీల హక్కుల కోసం పోరాటం
Published Tue, Sep 23 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement
Advertisement