Minority rights
-
మైనారిటీలతో ఎలా ఉండాలో మోదీకి చూపిస్తాం
లాహోర్: మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మూకహింసపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. మైనారిటీలకు హక్కులన్నీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని, దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా దార్శనికత కూడా ఇదేనన్నారు. çశనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇమ్రాన్ అన్నారు. పోలీసు హత్య కన్నా ఆవు చనిపోతేనే ప్రాధాన్యమిస్తున్నారని బులంద్‌షహర్ హింసను ఉద్దేశించిన షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
పాక్ రాజధానిలో హిందూ ఆలయం!
పాకిస్థాన్ అంటేనే పక్కా హిందూ వ్యతిరేక దేశం అని అంతా అనుకుంటారు. అక్కడ ఇస్లాం తప్ప మరో మతం వాళ్లు బతకగలిగే పరిస్థితి కూడా ఉండదని చెబుతారు. కానీ అలాంటి చోట.. అది కూడా పాక్ రాజధాని నగరమైన ఇస్లామబాద్‌లో తొలిసారిగా ఓ హిందూ ఆలయం, హిందువుల కోసం శ్మశానవాటిక కట్టాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ ఒకటి సూచించింది. ఇస్లామాబాద్‌లో ఇంతవరకు ఒక్క హిందూ ఆలయం కూడా లేదని, అక్కడ హిందువులు ఉన్నా, వారి ఇళ్లలో తప్ప ఆలయానికి వెళ్లి పూజలు చేసుకునే పరిస్థితి లేదని మత వ్యవహారాలపై జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సబ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రమేష్ లాల్ చెప్పారు. అలాగే హిందువులకు శ్మశాన వాటిక కూడా లేదన్న విషయం తెలిసి కమిటీ సభ్యులు షాకయ్యారు. ఇస్లామబాద్‌లో సుమారు 500 మంది హిందువులు ఉంటారు. వాళ్ల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం రావల్పిండి వెళ్తారని కమిటీ సమావేశంలో తెలిపారు. దేశంలో మైనారిటీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇంత దారుణంగా ఉందని రమేష్ లాల్ చెప్పారు. నగరంలో కనీసం ఒక ఆలయం, ఒక శ్మశాన వాటిక ఉండటం ప్రతి మతస్థులకు ప్రాథమిక హక్కని ఆయన అన్నారు. నగరంలో హిందువుల ఆలయం ఉంటే శాంతిభద్రతల సమస్య వస్తుందేమోనన్న అభ్యంతరాలను ఈ కమిటీ తిరస్కరించింది. హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నప్పుడు ఆలయాలకు భద్రత కల్పించలేరా అని కమిటీ సభ్యుడొకరు అడిగారు. ఇస్లామాబాద్‌లో వెంటనే హిందూ ఆలయం, శ్మశాన వాటిక నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాలని, అలాగే చర్చిల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కమిటీ సూచించింది. సయీద్పూర్ ప్రాంతంలో ఆలయానికి భూమి కేటాయించొచ్చని ప్రతిపాదించింది. పాకిస్థాన్ జనాభాలో హిందువులు, క్రిస్టియన్లు కలిపి మూడు శాతం ఉంటారు. -
మైనారిటీల హక్కుల కోసం పోరాటం
షోలాపూర్, న్యూస్‌లైన్: భారతదేశంలో మైనారిటీలకు సముచితస్థానం కోసం తాము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (ఎంఐఎం) నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదని, లౌకిక దేశమైన భారత్‌లో అన్ని మతాలవారికి సమాన హక్కు ఉండాలనేది తమ సిద్ధాంతమని ఆయనన్నారు. ఆయన సోమవారం రాత్రి స్థానిక హోం మైదానంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బాబ్రీ మసీద్ నేలమట్టమవడానికి ముందు భారతీయ జనతాపార్టీకి దేశం మొత్తం మీద ఇద్దరే ఎంపీలు ఉన్నారని, కాని మసీదు కూల్చివేత తర్వాత హిందుత్వవాదులుగా ప్రచారం చేసుకుని 280 ఎంపీ సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందు పరిషత్, భజరంగ్‌దళ్ వంటి మతసంస్థలతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే గోద్రా ఘర్షణలు జరిగిన విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. షోలాపూర్‌కే చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మతహింసను నిరోధించే బిల్లును పార్లమెంట్లో ఎందుకు ఆమోదింపజేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తాము హిందువులకు వ్యతిరేకంగా కాదన్నారు. అయితే హిందూత్వాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇతర మతాలపై దాడులు జరిపే ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి మతసంస్థలకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ దేశంలో ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందనే విషయాన్ని నేతలు గుర్తించాలన్నారు. దేశంలోని 85 శాతం మేర మైనార్టీలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవనం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నాయి తప్ప వారి ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఏమాత్రం కృషిచేయలేదని ఆయన ఆరోపించారు. పట్టణంలో మూడు లక్షల మంది వరకు మైనార్టీలున్నారు. వీరు టీ, గుట్కా తదితర వ్యసనాలపై ఖర్చు చేసే డబ్బులో రోజుకు ఒక్క రూపాయి చొప్పున మసీద్ కోసం జమ చేసినట్లైతే ఒక రోజుకు రూ. మూడు లక్షలు, అలాగే ఏడాదికి సుమారు రూ.11 కోట్లు ఆదా చేయవచ్చని, ఆ సొమ్ముతో ఇతరుల ముందు చేయి చాపాల్సిన అవసరం రాదని కూడా ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మైనార్టీలకు హితవు పలికారు.