
రామేశ్వరానికి కలాం భౌతికకాయం తరలింపు
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని తీసుకుని ప్రత్యేక విమానం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి మధురైకి బయల్దేరింది. కలాం భౌతికకాయంతో సైనిక వాహనం ఈరోజు ఉదయం 7 గంటలకు.. ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ నుంచి పాలం చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాంతో పాటు కేంద్రమంత్రులు మనోహర్‌పారికర్, వెంకయ్యనాయుడు బయల్దేరి వెళ్లారు.
అక్కడి నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో కలాం పార్థివదేహాన్ని రామేశ్వరం తీసుకెళతారు. అక్కడ బుధవారం సాయంత్రం 7 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.