సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ శిబిరాలపై జరిగిన వైమానిక దాడులు లక్ష్యాలను గురితప్పకుండా సాగాయని భారత వాయుసేన స్పష్టం చేసింది. నిర్ధేశిత లక్ష్యాలపై గురిపెట్టిన బాంబు దాడుల్లో 80 శాతం మేర లక్ష్యాలను ఢీకొన్నాయని పేర్కొంటూ దీనికి ఆధారంగా శాటిలైట్ చిత్రాలను భారత వాయు సేన ప్రభుత్వానికి అందచేసినట్టు తెలిసింది.
వైమానిక దాడులు లక్ష్యానికి దూరంగా సాగాయని, వాటి గురితప్పిందని సాగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంటూ వాయుసేన ఓ నివేదికను కేంద్రానికి సమర్పించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ కురిపించిన బాంబు దాడులు పాకిస్తాన్‌కు ఎలాంటి నష్టం కలిగించలేదని, కొన్ని చెట్లు కూలిపోవడం మినహా ఎలాంటి విధ్వంసం జరగలేదని పాక్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ మీడియా సైతం సందేహాలు వ్యక్తం చేసింది. అయితే బాలాకోట్ మెరుపు దాడుల ప్రధాన టార్గెట్ అయిన జైషే ఉగ్రవాద శిబిరం వద్దకు అంతర్జాతీయ మీడియాను పాక్ అనుమతించలేదు.
కాగా వైమానిక దాడుల తీరుతెన్నులను విశ్లేషిస్తూ శాటిలైట్ చిత్రాలతో కూడిన 12 పేజీల నివేదికను వాయుసేన భారత ప్రభుత్వానికి సమర్పించింది. బాలాకోట్ వైమానిక దాడులు విజయవంతమయ్యాయని చెప్పేందుకు ఈ ఆధారాలను మోదీ సర్కార్‌కు వాయుసేన సమర్పించినట్టు చెబుతున్నారు. దాడుల్లో భాగంగా మిరేజ్ 2000 యుద్ధవిమానాలు బాలాకోట్ జైషే శిబిరంపై ఇజ్రాయిల్ స్పైస్ 2000 ప్రిసిషన్ బాంబులతో విరుచుకుపడినట్టు వాయుసేన వర్గాలు వెల్లడించాయి.
ఈ బాంబులు నిర్ధేశిత భవనాల పైకప్పులను చిధ్రం చేసి లోపల భారీ పేలుడు సంభవించిందని, పైకి కనిపించని రీతిలో అంతర్గతంగా విధ్వంసం జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో భారత్ పీఓకేలో మెరుపు దాడులను చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment