సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నేపథ‍్యంలో జమ్ము కశ్మీర్‌లో విధించిన నియంత్రణలు తనను కలిచివేశాయని పేర్కొంటూ కేరళ క్యాడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సర్వీస్ నుంచి వైదొలిగారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయిన క్రమంలో రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది ప్రజలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయారని గోపీనాథన్ ఆవేదిన వ్యక్తం చేశారు. దాద్రా నగర్ హవేలిలో విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కన్నన్ తన రాజీనామాను ఉన్నతాధికారులకు అందచేశారు.
అణిచివేతకు గురైన ప్రజల వాణిని వినిపించే అవకాశం ఉంటుందనే ఆశతో తాను సివిల్ సర్వీస్‌లో అడుగుపెట్టానని, అయితే ఇప్పుడు స్వయంగా తనకే మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఎలా ఉన్నా దానిపై స్పందించే హక్కు ప్రజలకు ఉందని, అందుకు విరుద్ధంగా జమ్మూ కశ్మీర్‌లో ఆంక్షలు విధించారని, ప్రజలకు కీలక నిర్ణయాలపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా స్పందించే హక్కును నిరాకరించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ కొందరు అధికారులు ఎన్నికలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని గోపీనాథన్ ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను కలెక్టర్‌గా తప్పించి మరో శాఖలో అప్రాధాన్య పోస్టును కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment