
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ నివాసం ఎదుట పట్టుబడిన నలుగురు వ్యక్తులు తమ అధికారులేనని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గురువారం అంగీకరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ గస్తీలో భాగంగానే వారు అక్కడ విధుల్లో ఉన్నారని వివరణ ఇచ్చింది. అంతర్గత భద్రత పర్యవేక్షణ, శాంతిభద్రతలకు విఘాతం వంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించే క్రమంలో ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించే బాధ్యతను ఆ నలుగురు అధికారులకు అప్పగించారని ఐబీ వర్గాలు వెల్లడించాయి.
సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ ఐబీ అధికారులను నియోగిస్తారని, స్ధానిక పోలీసుల సహకారంతోనూ వీటిని చేపడతారని తెలిపాయి. తమ పరిశీలనలో తేలిన విషయాలను స్ధానిక పోలీసులకు చేరవేస్తే వారు వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి.
ఐబీ ఐడీ కార్డులతోనే వారు డ్యూటీలో ఉన్నారని, గురువారం ఉదయం ఐబీ యూనిట్ జన్‌పథ్ వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడటంతో అక్కడ ఆగిందని, దీంతో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి. మరోవైపు నలుగురు ఐబీ అధికారులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారన్న వార్తలను ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment