‘గాడిద తంతే మనం తిరిగి తంతామా?’
న్యూఢిల్లీ: భారత ఆర్మీని విమర్శించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్‌కు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఆయనకు అండగా నిలిచారు. ఎవరు మాటలు పనాగ్ పట్టించుకోవాల్సిన పనిలేదని అన్నారు. గాడిద మిమ్మల్ని తంతే దానిని తిరిగి తన్నుతారా? అంటూ ప్రశ్నించారు. కశ్మీర్ వీధుల్లో భారత జవాన్లపై వేర్పాటువాదులు భిన్నపద్ధతుల్లో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. రాళ్లు రువ్వుతూ నానా హంగామా చేస్తున్నారు. జవాన్లను ముందుకెళ్లనిచ్చే పరిస్థితి లేకుండా రాళ్ల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో బయటకు వచ్చింది.
అందులో రాళ్ల దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు జవాన్లు రాళ్లు రువ్వుతున్నవారిలో ఒకరిని తమ జీపునకు ముందు కట్టి తీసుకెళుతున్నట్లు ఉంది. దీనిపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్ స్పందిస్తూ భారత ఆర్మీని ఈ ఘటన ఎప్పటికీ వేటాడుతుందని, భారత ఆర్మీకి మాయని మచ్చగా ఉండిపోతుందని విమర్శించారు. ఆయన ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ అభిజీత్ తీవ్రంగా స్పందించారు. పనాగ్ ఒక పాక్ మద్దతుదారు అన్నారు. అలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. ఒకప్పుడు ఆర్మీకి సేవలు అందించిన వ్యక్తి ఇలాంటి మాటలు చేయకూడదంటూ పలువురు మండిపడ్డారు. కానీ, గాడిదలు తంతే మనం తిరిగి తంతామా అంటూ కట్జూ పనాగ్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.