
నేనే నియంతనైతే ఒకటో తరగతిలోనే ‘గీత’
సుప్రీంకోర్టు జస్టిస్ ఎ.ఆర్. దవే వ్యాఖ్య
అహ్మదాబాద్: భారతీయులంతా పాతకాలంనాటి సంప్రదాయాలను తిరిగి పాటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్. దవే సూచించారు. పిల్లలకు చిన్న వయసు నుంచే భగవద్గీత, మహాభారతాన్ని నేర్పించాలన్నారు. ఒకవేళ తానే నియంతను అయ్యుండుంటే విద్యార్థులకు ఒకటో తరగతిలోనే మహాభారతం, భగవద్గీతను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టే వాడినని వ్యాఖ్యానించారు. జీవితాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకోవాల్సినది ఆ మార్గంలోనేనన్నారు.
శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన ‘ప్రపంచీకరణ కాలంలో సమకాలీన అంశాలు, మానవహక్కులకు సవాళ్ల’పై అంతర్జాతీయ సదస్సులో దవే పాల్గొన్నారు. మంచి ఎక్కడున్నా సరే దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గురుశిష్య సంస్కృతి పోయిందని...అదే ఉండి ఉంటే సమాజం ఎదుర్కొంటున్న హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు ఉండేవి కావన్నారు.