
'అసహనమే ఉంటే 'పీకే' అంత హిట్టయ్యేది కాదు'
అసహనంపై ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఏకభవించడం లేదని బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా స్పష్టం చేశారు.
ముంబై: అసహనంపై ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఏకభవించడం లేదని బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా తెలిపారు. ఆమిర్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయినప్పటికీ ఆయన భారత్ కు అసహన ముద్ర వేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో ఇటీవల జరుగుతున్న ఘటనలు అభద్రతాభావాన్ని పెంచుతూ.. భయాన్ని రేకెత్తిస్తున్నాయని ఆమిర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.
ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించిన శత్రుఘ్న 'విశాలమైన మన మాతృగడ్డ అనాదిగా సహజంగా శాంతికాముక దేశం. ప్రతి మతాన్ని, కులాన్ని, జాతిని గౌరవించే దేశమిది. ఇక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తున్నది' అని అన్నారు. భారత్ లో అసహనముంటే ఆమిర్ నటించిన 'పీకే' సినిమా అంత గొప్ప విజయాన్ని సాధించి ఉండేది కాదని శత్రుఘ్నసిన్హా అభిప్రాయపడ్డారు. ' భారత్ అసహనపు దేశం అయి ఉంటే.. హిందూ దేవుళ్లు, దేవతలను హేళన చేసిన 'పీకే' సినిమా అంత విజయాన్ని సాధించేదే కాదు' అని పేర్కొన్నారు.