
చనిపోయిన ‘పెట్’ మొక్కై మొలిస్తే..
మన ఇంట్లో పుట్టకపోయినా మన మధ్యనే మన కుటుంబంలో భాగంగా మనతో కలసిమెలసి పెరిగిన పెంపుడు కుక్క పిల్లో, పిల్లి పిల్లో మరణిస్తే.... కొంత బాధగా అనిపించినా చివరికి పెంట కుప్పపై పడేస్తాం.
కోల్‌కతా: మన ఇంట్లో పుట్టకపోయినా మన మధ్యనే మన కుటుంబంలో భాగంగా మనతో కలసిమెలసి పెరిగిన పెంపుడు కుక్క పిల్లో, పిల్లి పిల్లో మరణిస్తే.... కొంత బాధగా అనిపించినా చివరికి పెంట కుప్పపై పడేస్తాం. లేదంటే మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తాం. అంతేగానీ, అది కూడా మనలాంటి జీవేకదా! అని భావించి, ఆ మృత జీవిని శ్మశాన వాటికకు తీసుకెళ్లి లాంఛనాల ప్రకారం ఖననం చేసి సమాధికట్టే వారు చాలా అరుదు. ప్రపంచంలోని పలు దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా పెంపుడు జంతువుల ఖననం కోసం ప్రత్యేక జంతు స్మశానాలు ఉన్నాయి.
బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లో ఎప్పటి నుంచో ఇలాంటి స్మశానాలు ఉండగా, ఢిల్లీ నగరంలో ఇటీవలనే వీటికోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ప్రజలు తమ పెంపుడు జంతువులు మరణించినప్పుడు వాటిని తీసుకొచ్చి వీటిల్లో ఖననం చేసి, సమాధులు నిర్మిస్తున్నారు. వాటిపై తమ స్థోమతకు తగ్గట్టుగా పేర్లు చెక్కిన శిలాఫలకాలను అమరుస్తున్నారు. ఏడాదికోసారి వచ్చి పూలు తీసుకొచ్చి నివాళులు కూడా అర్పిస్తున్నారు. ఇలా చేస్తున్నవారి సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో కోల్‌కతాలో ఓ జీవకారుణ్య స్వచ్ఛంద సంస్థ ఇక్కడ పెంపుడు జంతువుల ఖననానికి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.
నగరంలోని బెహలా ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ‘కరుణ కుంజ్’ పేరిట జంతు శ్మశానం ఉంది. చనిపోయిన పెంపుడు జంతువులను తెచ్చి నిర్వాహకులకు అప్పగిస్తే వారు గౌరవప్రదంగా వాటిని ఖననం చేస్తారు. ఆ జంతువుల మృతదేహం కుళ్లిపోయి మట్టిలో కలిసిపోయాక, సహజసిద్ధమైన ఎరువుగా మారిపోయిన ఆ మట్టిని పెంపుడు జంతువుల యజమానులకు అప్పగిస్తారు. వారు ఆ మట్టిని తీసుకెళ్లి శ్మశానం నిర్వాహకులు చూపిన చోట పోసి, అక్కడ వారికిష్టమైన మొక్కలను నాటాలి. వాటికి పెంపుడు జంతువుల పేర్లను నామకరణం చేయవచ్చు. మొక్కలను పోషించే బాధ్యతను శ్మశానమే తీసుకున్నప్పటికీ పెంపుడు జంతువుల యజమానులు వచ్చి తమ ‘పెట్’ పేరిట వెలిసిన మొక్కలను ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు. అంతేకాకుండా వారు తమతమ సంప్రదాయం ప్రకారం ఆ మొక్కలకు పూజలు కూడా చేయవచ్చు. చనిపోయిన జంతువు మరో జీవిగా పునర్జన్మ ఎత్తిందన్న భావన ప్రజల్లో కల్పించడంతోపాటు స్మశాన నిర్వాహకులు ఇలా పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌తో భారత్‌లో ఒక్క కోల్‌కతాలోనే జంతు శ్మశానాన్ని నిర్వహిస్తుండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి దృక్పథంతో స్మశానాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా, జపాన్, జర్మనీ దేశాల్లో ‘బీ ఏ ట్రీ’ నినాదంతో ఈ రకం శ్మశానాలను ప్రోత్సహిస్తున్నారు.