'నేనేం వెన్నెముక లేనోడ్ని కాదు'
తిరువనంతపురం: సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వంపై తనపై వేటు వేసే ఒక రోజుకు ముందు కేరళ డీజీపీ టీపీ సేన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లోని తన అధికార పేజీలో తానేం వెన్నుపూస లేని అధికారిని కాదంటూ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ పాలన తర్వాత కొత్తగా కేరళలో వామపక్ష పార్టీ పాలన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఉన్నత పోస్టుల బదిలీలు వేగవంతమయ్యాయి. అందులో భాగంగా డీజీపీ సేన్ పై కూడా బదిలీ వేటు వేశారు.
ఈ సందర్భంగా ఆయన ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. 'నాకు ఇప్పటికీ వెన్నుపూస ఉంది. ఉద్యోగం కోసం నేనేం ఎవరినీ శాంతపరచాలని కోరుకోను. పారదర్శకంగా, సానుకూలంగా పనిచేసేందుకే ప్రయత్నిస్తుంటాను' అని సేన్ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశాడు. 2006లో సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా డీజీపీ స్థాయి పోస్టులను బదిలీ చేయాలంటే కనీసం రెండేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, సేన్ నియామకం పూర్తయి ఏడాదే అవుతుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.