సాక్షి, న్యూఢిల్లీ : ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ఉత్తర భారతదేశాన్ని మరో ఉపద్రవం ముంచెత్తనుందని వాతావరణ విభాగం శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పెనుగాలులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని ప్రకటించింది. అదేవిధంగా రాజస్థాన్‌లో మరోసారి ఇసుక తుపాన్ సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమతీరంలోని మధ్యదరా సముద్రంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల కారణంగా వాయువ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో..
తూర్పు ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు.. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
దక్షిణాదిలో కూడా..
ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, చండీఘఢ్, పంజాబ్, హర్యానాలతో పాటు.. దక్షిణాదిలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. విదర్బ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అయితే రాజస్థాన్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎమ్‌డీ అధికారి తెలిపారు.
కాగా ఇటీవలి కాలంలో, తుపానులు, భారీ వర్షాలు ఉత్తర భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించాయి. వంద మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అలాగే జైపూర్, అజ్మీర్, జోద్‌పూర్, బికనీర్‌లో దుమ్ము తుపానులు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ విభాగం తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment