ఎల్జీ బైజాల్‌తో కేజ్రీవాల్, సిసోడియా భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య వివాదం యథాతథంగా కొనసాగుతోంది. నియామ కాలు, బదిలీలకు సంబంధించిన సిబ్బంది విభాగంపై అధికారం మాదంటే మాదని ఇటు సీఎం, అటు ఎల్జీ ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారుల బదిలీలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం పంపిన ఫైలును ఎల్జీ అనిల్ బైజాల్ తిప్పి పంపేశారు. మరోపక్క పాలనపై, అధికారులపై పట్టు సాధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ప్రజల ముంగిట్లోకే రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు.
ఎల్జీపై కేజ్రీవాల్ ధ్వజం
సుప్రీం తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఎల్జీ అనిల్ బైజాల్‌తో సీఎం కేజ్రీవాల్ సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదని, అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం తమకే ఉందని 2015లో హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీం రద్దు చేయలేదని ఎల్జీ కేజ్రీవాల్‌కు చెప్పారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఎల్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు.
సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్జీ అంగీకరించడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం బాహాటంగా తిరస్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించరాదని కేంద్ర హోం శాఖ తనకు సూచించిందని బైజాల్ నాతో చెప్పారు’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు అమలు చేయాలని కోరేందుకు కేజ్రీవాల్ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారు.
పాలనపై పట్టుకు ఆప్ యత్నాలు
తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో పాలనపై, అధికా రులపై పట్టు బిగించేందుకు ఆప్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యంత రాలన్నీ పక్కనపెట్టి ప్రజల ముంగిట్లోనే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆహార విభాగాన్ని ఆదేశించినట్టు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నా రు. దీనిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించానన్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎల్జీ గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విధానం అమలుకు ముందు కేంద్రాన్ని సంప్రదించాలని ఆప్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎల్జీ అభ్యంతరాలను తోసిరాజని కేజ్రీవాల్ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అధ్యక్షతన సమావేశమై వ్యయ, ఆర్థిక కమిటీ రెండు ప్రాజెక్టులను ఆమోదించింది. సిగ్నేచర్ బ్రిడ్జికి చివరి విడత నిధుల మంజూరుకు, ఢిల్లీ టెక్నికల్ వర్సిటీలో అకడమిక్ భవనం, హాస్టల్ గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఇంకో తీర్పు వస్తే పూర్తి స్పష్టత: ఎల్జీ
కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఎల్జీ తోసిపుచ్చారు. సిబ్బంది విభాగానికి సంబందించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో కూడా తీర్పు వస్తే ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని ఎల్జీ పేర్కొన్నారు. ఢిల్లీలో సిబ్బంది విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదంటూ 2015లో కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు ఇంకా రద్దు చేయలేదనీ, కాబట్టి ఉద్యోగుల బదిలీలపై అధికారం తమదేనంటూ కేజ్రీవాల్‌కు ఎల్జీ లేఖ రాశారు. హోం శాఖ స్పందిస్తూ.. సిబ్బం ది విభాగం అంశంపై సుప్రీంలో పెండిం గ్‌లో ఉన్నందున తాము తుది నిర్ణయం చెప్పడం చట్టవ్యతిరేకమవుతుందంది.
Comments
Please login to add a commentAdd a comment