ప్రతిపక్షాలకు లాలు మార్క్ ఝలక్
పట్నా: పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, వామపక్షాలకు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తన మార్కు ఝలక్ ఇచ్చారు. మొన్నటి వరకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఖండించిన లాలు అనూహ్యంగా మద్దతిచ్చారు. తాను కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడంలేదని, దానిని అమలుచేసే విధానాన్ని మాత్రమే తప్పంటున్నానని చెప్పి ఇతర పార్టీలను, మీడియాను అవాక్కయ్యేలా చేశారు. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేంద్రం నిర్ణయానికి బహిరంగంగా మద్దతివ్వగా లాలు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మరింత ఊపునిచ్చినట్లయింది.
ఈ నేపథ్యంలో బిహార్లో ఈ కూటమి బద్ధలయినట్లేనని, నితీశ్ బీజేపీకి మరోసారి దగ్గరవుతున్నారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈలోగా లాలు ప్రసాద్ కూడా నితీశ్ బాటలోకి వచ్చి ఔరా అనిపించారు. మంగళవారం లాలు ఇంటికి నితీశ్ వెళ్లారు. ఈ సందర్భంగా వారు కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో (నితీశ్ కూడా ఇందులో ఉన్నారు) లాలు మాట్లాడుతూ తాను నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదని, అమలు తీరునే తప్పుబడుతున్నానని అన్నారు. పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దాదాపు గంట సమావేశం తర్వాత లాలు ఈ ప్రకటన చేయడం గమనార్హం.