వాట్సాప్ గ్రూప్ పెట్టాలంటే.. లైసెన్స్ తీసుకోవాలి!
శ్రీనగర్: వాట్సాప్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ యూజర్లు ఎవరైనా ఉచితంగా గ్రూప్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, స్థానిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని.. వాట్సాప్ గ్రూపులపై ఉక్కుపాదం మోపాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్‌లో ఒక గ్రూప్‌ను నడిపించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, లైసెన్స్ లాంటి ధ్రువపత్రం సంబంధిత అధికారుల నుంచి పొందాలని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నది.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో యూజర్ల ప్రైవసీని వాట్సాప్ కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ముప్తి మెహబూబా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అల్లర్లకు ఆజ్యం పోస్తున్న సోషల్ మీడియా వేదికలపై ఉక్కుపాదం మోపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో వాట్సాప్‌లో గ్రూప్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధన కలిగిన తొలి ప్రాంతం ప్రపంచంలో ఇదే కావొచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది.
'సోషల్ మీడియా న్యూస్ ఏజెన్సీస్ నిర్వాహకులందరూ తమ గ్రూప్‌లలో వార్తలు పోస్టు చేసేందుకు సబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డివిజనల్ కమిషనర్ గురువారం ఆదేశాలు ఇచ్చారు' అని ప్రభుత్వ ప్రకటన ఒకటి మంగళవారం వెల్లడించింది.
కశ్మీర్‌లో ఏ చిన్న అలజడి జరిగినా రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హంద్వారాలో కాల్పుల నేపథ్యంలో మూడురోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా వాట్సాప్ గ్రూపులపై కూడా ఆంక్షలు విధించడంపై కశ్మీర్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతా అత్యాధునిక సాంకేతికతతో ముందుకుసాగుతుంటే.. సోషల్ మీడియా వినియోగం విషయంలోనూ తమపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.