
ఆ బ్యాంకులో భారీగా బ్లాక్‌మనీ డిపాజిట్!
నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జరుగుతున్న అవినీతిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జరుగుతున్న డిపాజిట్‌లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఢిల్లీలోని జైన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులోని లావాదేవీలపై ఆ రాష్ట్ర ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఐదు రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున నల్లధనం డిపాజిట్ అయిందని అధికారులు గుర్తించారు.
జైన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో 120 కోట్లకు పైగా డబ్బు నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీనిలో చాలా వరకు నల్లధనంగా అనుమానాలున్నాయని వారు తెలిపారు. దీంతో ఇక్కడి భారీ ఎత్తున డిపాజిట్ చేసిన వారిపై విచారణ కొనసాగుతుందని.. ఇందులో భాగంగానే ఐదోరోజు సైతం సోదాలు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. నల్లధనాన్ని మార్చడంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.