మంత్రి గారికి తప్పని కష్టాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కష్టాలు వీడటం లేదు. నిన్న మొన్నటి వరకు డెంగ్యూ తీవ్రస్థాయిలో ఉన్నా సరిగా పట్టించుకోవడం లేదంటూ జనం ఆయన మీద పడితే.. ఇప్పుడు తాజాగా ఆదాయపన్ను నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ శాఖ ఆయనకు నోటీసు జారీచేసింది. అయితే, ఇది పాత కేసులో రీ ఎసెస్‌మెంట్ మాత్రమేనని, అంతేతప్ప కొత్త కేసు ఏమీ కాదని జైన్ అంటున్నారు. తనను ఒక సాక్షిగా మాత్రమే పిలిచారన్నారు. గతంలో తాను ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టానని, వాటి విషయంలోనే రీ ఎసెస్‌మెంట్ జరుగుతున్నందున తనను పిలిచారని ఆయన చెప్పారు.
రెండు రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ఓ పెద్ద విషయం బయట పెట్టబోతున్నారని, దమ్ముంటే టీవీ చానళ్లు దాన్ని ప్రసారం చేయాలని ఆయన సవాలు చేశారు. కాగా, ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది నాయకులు వివిధ కేసులలో ఇరెస్టయ్యారు. గతవారంలో కూడా ఎమ్మెల్యేలు సోమనాథ్ భారతి, అమానతుల్లా ఖాన్‌లను అరెస్టుచేసినా, రెండు రోజుల్లోనే వాళ్లిద్దరూ బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు.